వైసీపీ నేత సజ్జలకు సంగం డైరీ షాక్..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ ‘సంగం డెయిరీ’ ఆయనపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసింది. సంగం డెయిరీపై సజ్జల రామకృష్ణారెడ్డి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేశారంటూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) గోపాలకృష్ణన్ గుంటూరు కోర్టులో ఈ సివిల్ పరువు నష్టం కేసును నమోదు చేశారు.
సంగం డెయిరీ అసలు పాల సేకరణే చేయకుండా, అక్రమ మార్గాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) నెయ్యి సరఫరా చేస్తోందంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సంగం డెయిరీ యాజమాన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవాలను పూర్తిగా కప్పిపుచ్చి, డెయిరీ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా.. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సజ్జల మాట్లాడారని ఎండీ గోపాలకృష్ణన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కట్టుకథలతో సంస్థపై బురదజల్లడమే లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఈ తప్పుడు ఆరోపణలను విస్తృతంగా ప్రసారం చేసినందుకు గానూ ‘సాక్షి టీవీ’ యాజమాన్యంతో పాటు, సదరు వార్తలను ప్రమోట్ చేసిన వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కూడా సంగం డెయిరీ చట్టపరమైన చర్యలకు దిగింది. తమ సంస్థకు జరిగిన పరువు నష్టానికి ప్రతిగా రూ.10 కోట్లు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ప్రముఖ డెయిరీ సంస్థను వివాదాల్లోకి లాగడంపై క్షేత్రస్థాయిలో ఉన్న పాడి రైతుల్లోనూ చర్చ మొదలైంది.








