గ్రూప్-1 ఉద్యోగాలను కేక్ ముక్కల్లా అమ్ముకున్నారు.. జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: ఎంపీ సానా సతీష్ బాబు
వైసీపీ హయాంలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో భారీగా అవకతవకలు జరిగాయని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు తీవ్రంగా ఆరోపించారు. ఉద్యోగాలను జగన్ అండ్ కో కేక్ ముక్కల్లా అమ్ముకున్నారని, ఈ అక్రమాల ద్వారా వందల కోట్ల రూపాయలు వైసీపీ నేతలకు చేరాయని మండిపడ్డారు. సిట్ నివేదిక నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరగాలని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మరని, దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడాలని సవాల్ విసిరారు.
బీసీల రిజర్వేషన్లపై చారిత్రాత్మక నిర్ణయం:
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని సానా సతీష్ బాబు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం వల్ల దాదాపు 16,800 మంది బీసీలు రాజకీయ పదవులు కోల్పోయారని తెలిపారు. నాడు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని కొనియాడారు.
బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి టీడీపీకి ప్రత్యేక చరిత్ర ఉందని, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు బీసీలకు అనేక అవకాశాలు కల్పించారని ఎంపీ గుర్తుచేశారు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలుస్తున్న చంద్రబాబు బీసీల ఆశాజ్యోతి అని పేర్కొన్నారు. ఈ 34 శాతం రిజర్వేషన్లతో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీల భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.








