పవన్ సంచలన ట్వీట్, సైనికుల ఆత్మగౌరవం ముఖ్యం..!
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయి నుంచి పట్టు సాధించేందుకు జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమరశంఖం పూరించారు. ఈ మేరకు జనసేన లెజిస్లేటర్ పార్టీ (JSPLP) సమావేశాన్ని నిర్వహించిన ఆయన, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సుదీర్ఘంగా సమీక్షించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి వ్యూహాలు మరియు జనసేన క్యాడర్ అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో లోతుగా చర్చించినట్లు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
గత ఐదేళ్ల కాలంలో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని, పార్టీని నిలబెట్టిన జనసైనికుల పోరాట స్ఫూర్తిని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచార వ్యూహాల్లో జనసైనికుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా, వారికి సముచిత స్థానం దక్కేలా పార్టీ ముందడుగు వేస్తుందని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జనసేన జెండాను ఎగురవేయాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బంధాన్ని మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేలా ఈ ఎన్నికల ప్రణాళికలు ఉండబోతున్నాయి. పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ స్థానాల్లో ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్తూనే, జనసేన బలమైన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని పవన్ కల్యాణ్ ప్రజాప్రతినిధులకు సూచించారు.








