రేపటి నుంచి కేరళలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గత కొంతకాలంగా వరుస ఎన్నికల ప్రచారాలు, రాజకీయ పర్యటనలు, ఆపై డిప్యూటీ సీఎంగా ప్రభుత్వ అధికారిక బాధ్యతలతో బిజీగా గడుపుతున్న పవన్ కల్యాణ్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా గతంలో తీవ్రంగా వేధించిన వెన్నునొప్పితో పాటు, ఇటీవలే ఆయన భుజానికి శస్త్రచికిత్స (Surgery) కూడా చేయించుకున్నారు. ఈ క్రమంలో సర్జరీ తర్వాత శరీరం పూర్తి స్థాయిలో కోలుకునేందుకు వీలుగా ఆయనకు విశ్రాంతితో పాటు ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు సూచించారు.
వైద్యుల సలహా మేరకు పవన్ కల్యాణ్ రేపటి నుంచి కేరళ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ ఉన్న ఒక ప్రముఖ ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో సుమారు 20 రోజుల పాటు ఆయన బస చేయనున్నారు. భుజం శస్త్రచికిత్స తర్వాత అవసరమైన ప్రత్యేక ఫిజియోథెరపీతో పాటు, శరీరానికి సాంప్రదాయ కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సలు, డిటాక్సిఫికేషన్ ప్రక్రియలను ఆయన అక్కడ తీసుకోనున్నారు. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ఈ సుదీర్ఘ చికిత్స ద్వారా అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత ఉపశమనం పొందాలని ఆయన భావిస్తున్నారు.
ఈ 20 రోజుల చికిత్సా కాలంలో పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలకు, ప్రభుత్వ సమీక్షా సమావేశాలకు తాత్కాలికంగా దూరంగా ఉండనున్నారు. కేరళలో ప్రకృతి వైద్యం ముగిసిన తర్వాత, ఆయన పూర్తి ఆరోగ్యంతో, సరికొత్త ఉత్సాహంతో మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో యాక్టివ్ కానున్నారు. డిప్యూటీ సీఎం సుదీర్ఘ చికిత్సకు వెళ్తున్నారనే వార్తతో జనసైనికులు మరియు ఆయన అభిమానులు పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.








