‘ఇరుముడి’ : రవితేజకు USలో కలిసొస్తున్న సుడి
నాలుగేళ్ల తర్వాత రవితేజ సినిమాకు అమెరికాలో మళ్లీ ముందస్తు సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రీ-సేల్స్ $225K దాటడంతో ఆయన అభిమానుల్లో హిట్ కొట్టబోతున్నామనే ఉత్సాహం కనిపిస్తోంది!అలాగే తెలుగు రాష్ట్రాల్లో బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ కలిపి ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. బుక్‌మైషోలో 72 వేల+, డిస్ట్రిక్ట్‌లో 38 వేల+ టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ సమాచారం.
ముఖ్యంగా అమెరికాలో ఒక తెలుగు సినిమాకు టికెట్లు ముందుగానే అమ్ముడవుతున్నాయంటే.. అది కేవలం ఓవర్సీస్ బాక్సాఫీస్ నంబర్ చెప్పలేం. ముఖ్యంగా ఆ హీరోకు US మార్కెట్ ఎప్పుడూ పెద్ద స్ట్రాంగ్ గా లేకపోతే.. ఆ సంఖ్య మరింత ఇంట్రస్టింగ్ గా మారుతుంది. ఇప్పుడు రవితేజ ‘ఇరుముడి’ విషయంలో అదే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ఒకేసారి అడ్వాన్స్‌లు కదలడం వల్ల మొదటి రోజు ఓపెనింగ్స్‌పై ట్రేడ్‌లో అంచనాలు పెరిగాయి.
ముఖ్యంగా నాలుగేళ్లుగా సరైన థియేట్రికల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు.. ఈసారి మొదటి సిగ్నల్ అమెరికా నుంచే వస్తోందా? అనిపిస్తోంది.
USలో ఎందుకింత ఆసక్తి?
రవితేజకు ఓవర్సీస్లో ఎప్పుడూ భారీ మార్కెట్ లేదు. ఆయన సినిమాలు అక్కడ మొదటి నుంచే పెద్ద నంబర్లతో దూసుకెళ్లిన సందర్భాలు తక్కువ. సాధారణంగా సినిమా బాగుందనే టాక్ వచ్చిన తర్వాతే US మార్కెట్లో వసూళ్లు పెరిగే పరిస్థితి కనిపించేది.
‘ఇరుముడి’ విషయంలో మాత్రం విడుదలకు ముందే ఇంట్రస్ట్ కనిపిస్తోంది. ఇది కూడా సినిమా కంటెంట్‌పై ఏర్పడుతున్న అంచనాలతో ముడిపడి ఉంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా తండ్రి-కూతురు బంధం, భావోద్వేగాలు, భక్తి నేపథ్యంతో కూడిన ఫ్యామిలీ థ్రిల్లర్‌గా ప్రచారం అవుతోంది.
అమెరికాలోని తెలుగు కుటుంబ ప్రేక్షకులకు ఈ కాంబినేషన్ ఎందుకు కనెక్ట్ అవుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. వీకెండ్లో కుటుంబంతో సినిమా చూడాలనుకునే NRI ప్రేక్షకుడికి హీరో ఇమేజ్ ఒక్కటే నిర్ణయాత్మక అంశం కాదు. కథలో ఫ్యామిలీ ఎమోషన్ ఉందా? పిల్లలతో కలిసి చూడొచ్చా? సినిమా తర్వాత కూడా గుర్తుండే అనుభూతి ఇస్తుందా? అన్నవి కూడా టికెట్ కొనడానికి కారణాలవుతాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు మిస్టరీ, థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫాదర్-డాటర్ బాండ్, డివినిటీ కూడా ఉంటాయని టీమ్ చెబుతోంది.
మల్లెపూల పల్లకి పాటకు వచ్చిన రెస్పాన్స్ కూడా సినిమాకు ఉపయోగపడింది. టీజర్, ట్రైలర్లో రవితేజ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌పై కూడా ఫ్యాన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సినిమా మీద ఆయన కూడా చాలా నమ్మకంగా మాట్లాడుతున్నాడు. బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అయితే ప్రీ-సేల్స్ ఎంత బలంగా ఉన్నా.. చివరికి సినిమా టాక్‌ను బట్టి రెండో రోజు నుంచి బాక్సాఫీస్ మారిపోతుంది. కానీ రవితేజ కెరీర్ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ నంబర్ ఒక సైకాలజికల్ సిగ్నల్ కూడా.
ఎంతొస్తే ఓవర్ సీస్ బ్రేక్ ఈవెన్..
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ‘ఇరుముడి’ ఓవర్సీస్ హక్కుల విలువ సుమారు ₹4 కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. దాంతో USలో సుమారు $1 మిలియన్ బ్రేక్ ఈవెన్ అవసరం. అందుకే $225K అనేది ముగింపు కాదు. అసలు ప్రయాణానికి మొదటి మెట్టు మాత్రమే.
రవితేజ చివరి థియేట్రికల్ సక్సెస్ ‘ధమాకా’. 2022లో వచ్చిన ఆ సినిమా తర్వాత ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో నిలబడలేదు. ఇదే ‘ఇరుముడి’ని మరో సాధారణ విడుదలగా కాకుండా.. కమ్‌బ్యాక్ టెస్ట్‌గా మార్చింది.
₹20 కోట్ల బిజినెస్.. అసలు టార్గెట్ ఎంత?
‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ సుమారు ₹20 కోట్లుగా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కల ప్రకారం సినిమా సేఫ్ జోన్లోకి రావాలంటే సుమారు ₹45 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంటుందని అంచనా.
ఈ టార్గెట్ రవితేజ మార్కెట్‌కు అందనంత దూరంలో లేదు.
ఏదేమైనా ..
నాలుగేళ్లుగా రవితేజ కోసం ఎదురుచూస్తున్న ఆ కమ్‌బ్యాక్‌కు.. ఈసారి తొలి ముడి మాత్రం అమెరికాలోనే పడినట్టైంది.ఇది నిజంగా హిట్‌గా మారుతుందా? ఆగస్టు 21 తర్వాతే తెలుస్తుంది.








