మహాబలిపురంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ (Southern Zonel Council) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమష్టి సహకారం, పరస్పర అవగాహన ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యం సాకారమవుతుందని స్పష్టం చేశారు. రాబోయే 2047 నాటికి దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా ఉమ్మడి వ్యూహాలతో సమష్టి అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
దక్షిణాది రాష్ట్రాల మధ్య రవాణా, మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు చంద్రబాబు పలు కీలక ప్రతిపాదనలను కౌన్సిల్ ముందు ఉంచారు. అందులో భాగంగా కుప్పం మీదుగా బుల్లెట్ రైలు ప్రాజెక్టును తీసుకురావాలని ప్రతిపాదించారు. ఈ బుల్లెట్ రైలు కనెక్టివిటీ ద్వారా రాష్ట్రాల మధ్య వాణిజ్యం, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ నదుల అనుసంధానం ద్వారా సముద్రంలో వృథాగా కలిసిపోతున్న 500 టీఎంసీలకు పైగా వరద జలాలను సద్వినియోగం చేసుకోవచ్చని, ఇది దక్షిణాది రాష్ట్రాల తాగు, సాగునీటి ఇబ్బందులను శాశ్వతంగా తీరుస్తుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సంబంధించిన పలు అపరిష్కృత అంశాలను సీఎం చంద్రబాబు ఈ వేదికపై ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా ఇంకా పెండింగ్లో ఉన్న షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల విభజనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, త్వరితగతిన తుది నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూనే, ఏపీకి దక్కాల్సిన హక్కులను, కేటాయింపులను వేగవంతం చేయాలని కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్లారు.








