అజ్ఞాతంలోకి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫ్యామిలీ..?
శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni Seetaram) వ్యవహారంతో రాజకీయంగా తీవ్ర కలకలం రేగుతోంది. నకిలీ పత్రాలతో కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంతో, వైస్సార్సీపీ (YSRCP) సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరియు ఆయన కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అరెస్ట్ భయంతోనే వారు పరారయ్యారని, ప్రస్తుతం వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలుస్తోంది. చాపురం వద్ద జరిగిన ఈ ల్యాండ్ స్కామ్ వ్యవహారంలో శ్రీకాకుళం రూరల్ పోలీసులు మొత్తం 13 మందిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
ఈ కేసులో తమ్మినేని కుటుంబ సభ్యులను కీలక నిందితులుగా చేర్చారు. ఇందులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఏ-6 గా, ఆయన భార్య తమ్మినేని వాణిని ఏ-7గా, మరియు వారి కుమారుడు తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్‌ను ఏ-5గా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. చాపురం సత్యసాయి నగర్ లేఅవుట్ పరిధిలో దాదాపు రూ. 4 కోట్ల విలువైన 900 గజాల స్థలంపై ఈ వివాదం నెలకొంది. అసలు భూ యజమాని బతికి ఉండగానే, ఆయన చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారు.
అంతేకాకుండా, ఒడిశాకు చెందిన ఒక మహిళను ఆ యజమాని కుమార్తెగా చూపిస్తూ తప్పుడు వారసత్వ పత్రాల ద్వారా ఈ స్థలాన్ని తమ్మినేని కుమారుడి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆధారాలు లభించాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శ్రీకాకుళం పోలీసులు ఈ కుట్రకు సహకరించిన మధ్యవర్తులు, డాక్యుమెంట్ రైటర్లు సహా ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య, కుమారుడు ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సమాచారం.








