యూఏఈతో చంద్రబాబు కీలక ఒప్పందం, రూ.100 కోట్ల ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఆహార శుద్ధి (Food Processing) రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా మరో కీలక అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల విలువను పెంచడంతో పాటు వాటిని ప్రపంచ మార్కెట్లకు తీసుకెళ్లే లక్ష్యంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( UAE)కు చెందిన ఫుడ్ క్లస్టర్ (Food Cluster)తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB) అవగాహన ఒప్పందం (MoU) చేసుకుంది. ఈ ఒప్పందం రాష్ట్రంలో పెట్టుబడులు, ఎగుమతులు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు.
ఈ ఒప్పందం ముఖ్యమంత్రి చంద్రబాబు, యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ (Abdulla Bin Touq Al Marri) సమక్షంలో కుదిరింది. ఈ ఏడాది ప్రారంభంలో దావోస్ (Davos)లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum) సందర్భంగా జరిగిన చర్చలకు ఇది కొనసాగింపుగా రూపుదిద్దుకుంది. అప్పట్లో వ్యక్తమైన ఆసక్తి ఇప్పుడు అధికారిక ఒప్పందంగా మారడం రాష్ట్రానికి శుభపరిణామమని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో పండే మామిడి, అరటి, కోకో, మిర్చి, పామాయిల్, కాఫీ వంటి వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత మార్కెట్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు ద్వారా ముడి ఉత్పత్తులను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
ఇవి కూడా చదవండి
ఒప్పందంలో భాగంగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ (Floor Masters International) సంస్థ తొలి పెట్టుబడిగా రూ.100 కోట్లను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ చిత్తూరు జిల్లా (Chittoor District)లోని గంగాధర నెల్లూరు (Gangadhara Nellore)లో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్లో తయారయ్యే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేయాలని ప్రణాళిక రూపొందించారు.
ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే రైతులకు కూడా గణనీయమైన ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంటోంది. స్థానికంగా పండే పంటలకు స్థిరమైన మార్కెట్ ఏర్పడటంతో పాటు, ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించే అవకాశాలు పెరుగుతాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా విస్తరించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
దావోస్‌లో జరిగిన చర్చలు కేవలం హామీలకే పరిమితం కాకుండా, ఆరు నెలల్లోనే అమలులోకి వచ్చే స్థాయికి చేరుకోవడం సంతోషకరమని చంద్రబాబు అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థూల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ, ఉద్యాన రంగాల వాటా దాదాపు 30 శాతం వరకు ఉందని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 200కు పైగా ఉద్యాన క్లస్టర్లు పనిచేస్తున్నాయని, ఈ మౌలిక వసతులను ఉపయోగించుకుని ప్రపంచ స్థాయి ఆహార శుద్ధి పరిశ్రమలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కొత్త ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడిందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విదేశీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం కలిసి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు తీసుకురానున్నాయని భావిస్తున్నారు.








