వైసీపీ నేత తమ్మినేనికి హైకోర్టులో చుక్కెదురు
వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram), ఆయన భార్య వాణి (Vani), కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకు హైకోర్టు (High Court)లో చుక్కెదురైంది. నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రూ.4 కోట్ల విలువైన ఆస్తిని కుమారుడి పేరుపై రాయించుకున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టు నుంచి వారికి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. క్వాష్ పిటిషన్లో ఈ తరహా ఉత్తర్వులివ్వలేమని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని గుర్తుచేసింది. అరెస్టు చేస్తారన్న ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ (Anticipatory bail) పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఉత్తర్వులిచ్చారు.








