పొగాకుపై జీఎస్టీ తగ్గించండి.. నిర్మలా సీతారామన్‌కు మంత్రులు, ఎంపీల విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) కేంద్ర, రాష్ట్ర మంత్రులు మరియు ఎంపీల ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ను కలిశారు. ముడి పొగాకు పై ప్రస్తుతం అమలవుతున్న 40 శాతం జీఎస్టీ (GST)ని 28 శాతానికి తగ్గించాలని కోరుతూ ఈ సందర్భంగా వారు అధికారిక వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి ఆర్థిక సమస్యలను కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లి, రైతాంగ ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వినతిపత్రం సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రికి ఏపీ మంత్రులు స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ జీఎస్టీ తగ్గింపు అభ్యర్థన కేవలం ముడి పొగాకుకు మాత్రమే వర్తిస్తుందని, సిగరెట్లు, గుట్కా వంటి తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటీవల జీఎస్టీ పెంపు కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఉత్పత్తి అవుతున్న ఎఫ్‌సీవీ పొగాకు మార్కెట్ విలువపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని వివరించారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర దక్కక నష్టపోతున్నారని, కాబట్టి రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పన్ను రేటును 40 శాతం నుండి 28 శాతానికి పునఃసమీక్షించి తగ్గించాలని కోరారు.








