సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర… వచ్చేఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు: మంత్రి లోకేష్
అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి
బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలి
మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలి
పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష
అమరావతి: రాష్ట్రంలో గత ఏడాది చేపడుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్పలితాలనిస్తోంది. ఉద్యమంలా పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలసికట్టుగా కృషిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2024నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 72.6శాతం ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25లక్షలమంది అక్షరాస్యులుగా మారారు, ఒక్క ఏడాదిలో ఇంత భారీగా అక్షరాస్యత సాధించడంపై ఎపి కృషిని కేంద్రప్రభుత్వం అభినందించినట్లు అధికారులు తెలుపగా, మంత్రి లోకేష హర్షం వ్యక్తంచేశారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షా ఫలితాల్లో 10శాతం పెరిగి 82.1శాతానికి చేరుకుంది, 2027 సెప్టెంబర్ నాటికి నూరుశాతం అక్షరాస్యత సాధన దిశగా పనిచేయాలని మంత్రి కోరారు. 2027 మార్చినాటికి మరో 25లక్షలమందిని, సెప్టెంబర్ నాటికి మిగిలిన 27లక్షలమంది అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం 11 ప్రభుత్వశాఖల సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి, పెద్దఎత్తున ప్రజలను చైతన్యవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ ఏడాది ఇంటర్మిడియట్ రెండో సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత సాధించామని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్మడియట్ లో సుమారు 10వేల అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. సంకల్ప్ అకడమిక్ సపోర్ట్ ప్రోగ్రామ్ కింద వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించేలా రూట్ మ్యాప్ రూపొందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ ఏడాది తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటికే రూ.1051 కోట్ల మేర ఆర్థిక సాయం అందించగా, మొదటి సంవత్సరం విద్యార్థులకు త్వరలో అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి నూరుశాతం అపార్ ఐడి ఇంటిగ్రేషన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.
బడిబయట చిన్నారులను పాఠశాలల్లో చేర్చేలా చర్యలు
పాఠశాల విద్యపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ… బడిఈడు పిల్లలందరినీ ట్రాక్ చేసి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ బడిబయట ఉన్న 1,64,821 మంది పిల్లలను పూర్తిస్థాయిలో పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవచూపాలని స్పష్టంచేశారు. పాఠశాల విద్య డైరక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ… ఈ ఏడాది 33వేలమంది బడిబయట ఉన్న చిన్నారులను స్కూళ్లలో చేర్పించామని, మిగిలిన వారి వివరాలను కూడా లీప్ యాప్ ద్వారా ప్రధానోపాధ్యాయులకు పంపించామని చెప్పారు. బడి ఈడు పిల్లలు ప్రతిఒక్కరినీ స్కూళ్లలో చేర్పించేలా తల్లిదండ్రులను చైతన్యవంతం చేసేలా చర్యలు తీసుంటున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీచర్ అటెండెన్స్ గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం ఉపాధ్యాయుల హాజరుశాతం 98.97శాతంగా ఉన్నట్లు చెప్పారు. విద్యార్థుల హాజరు శాతాన్ని 85.41శాతంగా ఉందని, దీనిని కూడా పెంచేందుకు కృషిచేయాలని మంత్రి కోరారు. ఏదేని విద్యార్థి వరుసగా 3రోజులపాటు వరసగా పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులను స్కూళ్లకు పిలిపించి ఎడ్యుకేట్ చేయాలని అన్నారు. ఈ విషయంలో స్కూలు మేనేజ్ మెంట్ కమిటీలకు కూడా బాధ్యతలు అప్పగించాలన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించడంపై మంత్రి లోకేష్ ఉపాధ్యాయులు, అధికారులను అభినందించారు. ఎఐ సమర్థ్ ఇనిషియేటివ్ ద్వారా ఉపాధ్యాయులకు ఎఐ టూల్స్ లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ విద్యాసంవత్సరంలో పదోతరగతి విద్యార్థులకు నిర్వహించే మిషన్ మార్చి -2026పై సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు తప్పనిసరిగా నిర్వహించాల్సిన స్పెషల్ టెట్ నిర్వహణపై చర్చించారు. ఈనెల 5వతేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో 192మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్య డైరక్టర్ చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యత విషయంలో రాజీ పడబోమని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లీప్ యాప్ ద్వారా ఫీడ్ బ్యాక్ అందజేయాలని మంత్రి కోరారు. విద్యార్థుల్లో మనోవికాసానికి, వత్తిడిలేని అభ్యసన పద్ధతులపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 కేంద్రాల్లో ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, పాఠశాల విద్య తమీమ్ అన్సారియా, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు, పాఠశాల విద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎండి దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








