ఏపీలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం..పలు ఫ్లైట్స్ దారి మళ్లింపు..!
ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కోస్తాంధ్రా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. విమానాశ్రయాల పరిసరాల్లో విజిబిలిటీ గణనీయంగా తగ్గడంతో, పైలట్లు విమానాలను ల్యాండ్ చేయలేక సమీప నగరాల్లోని ఎయిర్పోర్టులకు దారిమళ్లిస్తున్నారు. ఇప్పటికే పలు విమానాలను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్రతికూల వాతావరణం కారణంగా గురువారం ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానానికి (IndiGo Flight) గాన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ అనుమతి లభించలేదు. దీంతో అధికారులు ఆ విమానాన్ని హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారిమళ్లించారు. అదేవిధంగా, శంషాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ (Star Airlines) విమానం కూడా అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో బెంగళూరు కేంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారిమళ్లింది.
వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల మరికొన్ని విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తుండగా, కొన్ని సర్వీసులను ఎయిర్పోర్టు అధికారులు రద్దు చేశారు. హఠాత్తుగా విమానాలు దారిమళ్లడం, రద్దు కావడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రయాణికులు ఎవరైనా సరే విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ ఫ్లైట్ స్టేటస్ మరియు షెడ్యూల్ వివరాలను ముందస్తుగా ఆయా ఎయిర్లైన్స్ ద్వారా చెక్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.








