బ్రేకింగ్: ఉత్తరాంధ్ర సహా 7 జిల్లాలకు ఆకస్మిక వరదలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరానికి సమీపించడంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్రాలో విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా 7 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆకస్మిక వరదల (Flash Floods) ముప్పు పొంచి ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉన్న జిల్లాల జాబితాలో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలు ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 141.4 మిమీ, సోంపేటలో 134.6 మిమీ భారీ వర్షపాతం నమోదైంది. ఈ తుఫాను ముప్పు మరియు భారీ వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులను హై అలర్ట్‌లో ఉంచారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.








