వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) తన దర్యాప్తును తీవ్రతరం చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో లోతుగా విచారిస్తున్న ఈడీ అధికారులు గురువారం కీలక అడుగు వేశారు. హత్య కేసులో ఏ2 గా ఉన్న సునీల్ యాదవ్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు.
ఈ విచారణలో ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ అధికారులు దృష్టి కేంద్రీకరించారు. వివేకాను అంతమొందించడానికి రూ.40 కోట్ల నిధుల సమీకరణ జరిగిందనే ఆరోపణలపై సునీల్ యాదవ్‌ను ఈడీ అధికారులు నిలదీసినట్లు సమాచారం. ఈ నిధులు ఎక్కడి నుండి వచ్చాయి..? వాటిని ఎవరెవరికి, ఏ విధంగా రూటింగ్ చేశారు..? అనే కోణంలో ఆరా తీశారు.
విచారణకు హాజరైన సునీల్ యాదవ్ తన వ్యక్తిగత మరియు కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలను, గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన ఆర్థిక లావాదేవీల రికార్డులను ఈడీ అధికారులకు సమర్పించారు. హత్యకు స్కెచ్ వేసిన సమయం నుండి, అది అమలు చేసిన రోజు వరకు జరిగిన ప్రతీ చిన్న ట్రాన్సాక్షన్‌ను ఈడీ విశ్లేషిస్తోంది. వివేకా హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు..? ఈ కోట్ల రూపాయల వెనుక ఉన్న అసలు ముఠా ఏది.? అనే మిస్టరీని ఛేదించడానికి సునీల్ యాదవ్ ఇచ్చిన వివరాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ విచారణ తర్వాత ఈడీ తదుపరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుందనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.








