రాయదుర్గంలో పర్యటనకు లోకేష్.. కీలక ప్రాజెక్ట్ లకు శ్రీకారం..!
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శాంతినగర్ నుండి కణేకల్లు రోడ్డు వరకు సుమారు 15 వేల మంది భారీ జనసందోహం, నాయకులు, మరియు కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ రోడ్‌షో నిర్వహింనున్నారు. ఈ భారీ రోడ్‌షోకు సంబంధించి రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేశాయి.
రాష్ట్ర పారిశ్రామిక, ఇంధన రంగాల్లో మైలురాయిగా నిలిచేలా రాయదుర్గం పర్యటనలో మంత్రి లోకేష్ పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 1,325 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సరికొత్త పవన విద్యుత్ (Wind Power) ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. వీటితో పాటు, హులికెరలో సుజ్లాన్ (Suzlon) కంపెనీకి చెందిన అధునాతన ‘S144’ నూతన బ్లేడ్ ఉత్పత్తి లైన్లను మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా రాయదుర్గం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధి మరింత వేగవంతం కానుంది. ఈ అధికారిక పారిశ్రామిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం, మంత్రి నారా లోకేష్ నల్లంపల్లి వద్ద స్థానిక టీడీపీ నేతలు, నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, మరియు రాబోయే రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రి లోకేష్ పర్యటన నేపథ్యంలో రాయదుర్గం పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.








