ఉప్పొంగుతున్న గోదావరి.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..!
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో గోదావరి(Godavari) నది ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం మరియు దిగువ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి గంటగంటకూ పెరుగుతుండటంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరుకుంది. ఎగువ నుండి ఇన్ ఫ్లో భారీగా వస్తుండటంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. గోదావరి నది పొడవునా ప్రధాన ప్రాంతాల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరువవుతున్నాయి.
కూనవరం వద్ద నీటిమట్టం 48.56 అడుగులుగా నమోదు కాగా, పోలవరం వద్ద 32.74 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. అటు ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. రాబోయే కొన్ని గంటల్లో గోదావరిలో వరద ప్రవాహం 8 నుండి 9 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అయితే ఈ గరిష్ట స్థాయికి చేరిన తర్వాత వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వరద ప్రభావిత జిల్లాల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మరియు సహాయక చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు పూర్తిగా రంగంలోకి దిగి సిద్ధంగా ఉన్నాయి. గ్రామాల్లోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున, ప్రమాదకరమైన కాజ్‌వేల వద్ద ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే నది ఉధృతంగా ఉన్నందున ఈతకు వెళ్లడం, చేపల వేటకు బోట్లలో ప్రయాణించడం లాంటి పనులు చేయకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను కోరింది.








