‘బుల్లెట్’ పేరిట పేదలపై దాడి.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!
తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములపై పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోతున్న వారితో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్న సుమారు 500 ఎకరాల పేదల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కునేందుకు కుట్ర పన్నుతోందని కేటీఆర్ మండిపడ్డారు. బాధితులకు బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని, ఆ న్యాయ ఖర్చులను పార్టీయే భరిస్తుందని భరోసా ఇచ్చారు.
తాము బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, అది రావాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి ముసుగులో పేదల పొట్టకొట్టడాన్ని సహించేది లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సమీపంలోనే ఉన్న జీఎంఆర్ ఎయిర్పోర్ట్ భూములను వాడుకోవచ్చని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను సేకరించవచ్చని ఆయన సూచించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు బలరాం నాయక్, వివేక్ వెంకటస్వామి లాంటి పెద్దల జోలికి వెళ్లడం లేదని, కేవలం నిస్సహాయులైన పేదల భూములపైనే కన్నేశారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిందని కేటీఆర్ దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఫార్మా సిటీ భూములను ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మారుస్తున్నారని, అక్కడ పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. మరోవైపు కొత్వాల్‌గూడ నుంచి కొడంగల్ వరకు నిర్మిస్తున్న రోడ్డు పక్కన కాంగ్రెస్ నేతలు బినామీ పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కొనుగోళ్ల వెనుక ఉన్న కాంగ్రెస్ పెద్దల చిట్టా తమ వద్ద ఉందని, అతి త్వరలోనే అన్ని పేర్లను ఆధారాలతో సహా బయటపెడతామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ భూసేకరణపై హైకోర్టు స్టే విధించడంతో ప్రస్తుతానికి ప్రక్రియ తాత్కాలికంగా ఆగిందని కేటీఆర్ తెలిపారు. రైతులు ఐక్యంగా ఉండటం అత్యంత కీలకమని, ఒక్కసారి సంతకాలు పెడితే న్యాయపరంగా పోరాడటం కష్టమవుతుందని హెచ్చరించారు. గ్రామాల్లో ఇతర రైతులకు వాస్తవాలు వివరించి ఐకమత్యంగా ముందుకు సాగాలని సూచించారు. “ఇంకో ఏడాది ఆగండి.. మళ్లీ మనం అధికారంలోకి వస్తాం. మరో ఏడాదిన్నరలో ఎన్నికల కోడ్ వస్తుంది, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు” అని కేటీఆర్ రాజకీయ భరోసా ఇచ్చారు. మోసపోతే గోసపడతారని కేసీఆర్ ఎన్నికల ముందే హెచ్చరించారని గుర్తుచేస్తూ, బాధితుల హక్కుల కోసం బీఆర్ఎస్ న్యాయస్థానాల్లో తుదిదాకా పోరాడుతుందని తేల్చిచెప్పారు.








