తక్కువ జీతాలకు విదేశీయులొద్దు.. హెచ్-1బీ వీసా పై జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
అమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసా దరఖాస్తులపై ట్రంప్ యంత్రాంగం విధించిన లక్ష డాలర్ల (100,000 డాలర్లు) చెల్లింపు నిబంధనను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గట్టిగా సమర్థించారు. అమెరికన్ కార్మికులకు బదులుగా తక్కువ వేతనాలకే లభించే విదేశీ ఉద్యోగులను కంపెనీలు భర్తీ చేయడానికి ఈ వీసా కార్యక్రమాన్ని అనుమతించకూడదని ఆయన స్పష్టం చేశారు. ‘ఆల్-ఇన్ పోడ్కాస్ట్’లో మాట్లాడిన వాన్స్, అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడేలా అత్యున్నత ప్రతిభావంతులను దేశానికి రప్పించేందుకే ఈ వీసా ప్రోగ్రామ్ ఉండాలని పేర్కొన్నారు.
హెచ్-1బీ వీసా అసలు ఉద్దేశం ఇదే..
అమెరికాలో ఉపాధి పొందేవారి స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలు దీనిని ఒక ప్రత్యామ్నాయంగా వాడుకోకూడదని ఆయన తెలిపారు. ఉదాహరణకు 60,000 డాలర్లు సంపాదిస్తున్న ఒక అమెరికన్ ఉద్యోగిని తొలగించి, అదే పనికి 45,000 డాలర్లు తీసుకునే విదేశీ ఉద్యోగిని నియమించుకునే పద్ధతి సరికాదన్నారు. పెద్ద ఎత్తున అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూనే, మరోవైపు హెచ్-1బీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీల తీరును ఆయన తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి
కఠినతరమవుతున్న నిబంధనలు ..
హెచ్-1బీ విధానంలో ఉన్న లొసుగులు, మోసాలను అరికట్టే దిశగా కాంగ్రెస్లో రాజకీయ చొరవ కొరవడటంతోనే తమ ప్రభుత్వం కార్యనిర్వాహక చర్యలు చేపట్టిందని వాన్స్ వెల్లడించారు. సెప్టెంబర్ 18 నాటి ప్రకటన ప్రకారం.. అమెరికా వెలుపల ఉన్న హెచ్-1బీ కార్మికుల దరఖాస్తులకు నిర్దిష్ట మినహాయింపులతో కూడిన $100,000 చెల్లింపు నిబంధనను 2027 సెప్టెంబర్ 21 వరకు పొడిగించారు. ఈ తాజా నిబంధనలు హెచ్-1బీ ఆశావహుల్లో, ముఖ్యంగా ఈ వీసాలపై ఎక్కువగా ఆధారపడే భారతీయ నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికన్ ఉద్యోగులను తొలగించి విదేశీయులను నియమించే కంపెనీలపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వాన్స్ సంకేతాలు ఇస్తున్నారు.








