హిందూ మహాసముద్రానికి విస్తరించనున్న సంక్షోభం.. ఇరాన్ తీవ్ర హెచ్చరికలు..!
పశ్చిమాసియా సంక్షోభం మరింత విస్తరించనుందా.. లేటెస్టుగా ఇరాన్ అగ్రనాయకత్వం ప్రకటన చూస్తుంటే అదే అనిపిస్తోంది. తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగితే.. యుద్ధాన్ని హిందూ మహాసముద్రం వరకూ విస్తరిస్తామని హెచ్చరికలు జారీచేసింది. ఈ పరిణామం భారత్ ఇంధన దిగుమతులు, సముద్ర వాణిజ్యంపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఉద్రిక్తతలు హిందూ మహాసముద్రానికి వ్యాపిస్తే, అది భారత వాణిజ్య, ఇంధన భద్రతకు పెను సవాలుగా మారే అవకాశం ఉంది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి సలహాదారుగా ఉన్న యహ్యా రహీం సఫావి ఈ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ మరిన్ని దాడులకు పాల్పడితే, యుద్ధాన్ని మరింత విస్తృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. “ఈ పోరాటం ఇప్పటికే పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి నుంచి ఎర్ర సముద్రానికి విస్తరించింది. యుద్ధం కొనసాగితే, హిందూ మహాసముద్రం, ఆపై ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది” అని ఆయన పేర్కొన్నట్టు ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ఓ వీడియోను విడుదల చేసింది. ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారి ఒకరు హిందూ మహాసముద్రం గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించగా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్ర తీరం, కీలకమైన బాబ్ అల్-మందబ్ జలసంధిపై పట్టు బిగించారు. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిపై పట్టు కోసం ఇరాన్, అమెరికా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజా హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సంక్షోభం హిందూ మహాసముద్రానికి విస్తరిస్తే, పశ్చిమాసియా, యూరప్ , ఆఫ్రికాలతో భారత్‌ను కలిపే వాణిజ్య మార్గాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో అధిక భాగాన్ని పశ్చిమాసియా నుంచే దిగుమతి చేసుకుంటోంది. హర్మూజ్ లేదా సమీప జలాల్లో రవాణాకు ముప్పు ఏర్పడితే చమురు ధరలు, రవాణా ఖర్చులు, సముద్ర బీమా ప్రీమియంలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎర్ర సముద్రంలోని ఉద్రిక్తతల కారణంగా కొన్ని నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు యుద్ధం తూర్పు వైపు విస్తరిస్తే భారతీయ నౌకలు, దిగుమతిదారులపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. అంతేకాకుండా, హిందూ మహాసముద్రంలో భద్రతా బాధ్యతలు భారత నౌకాదళంపై అధికమవుతాయి.








