భారత్ పై ఆంక్షలు ప్రపంచానికే నష్టం.. జేపీ మోర్గాన్ చేజ్ హెచ్చరికలు..
భారత్ పై ఆంక్షలు ప్రపంచ చమురురంగంపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదముందని అమెరికాకు ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ హెచ్చరించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న విషయంలో భారత్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని, శిక్షార్హమైన టారిఫ్‌లు విధించవద్దని జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డైమన్ సూచించారు. ఈ విషయంలో తొందరపడి ఏకపక్షంగా ముందుకెళ్తే తీవ్ర ప్రతికూల ప్రభావం తప్పదని స్పష్టం చేశారు.
రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై టారిఫ్‌లు విధించే ముందు, అమెరికా ప్రభుత్వం క్షుణ్ణంగా ఆలోచించాలన్నారు జేమీ డైమన్ . భారత రిఫైనరీలు రష్యా చమురును ఎలా వినియోగిస్తున్నాయో, వాటి అవసరాలేమిటో వాషింగ్టన్ మొదట అర్థం చేసుకోవాలని హితవు పలికారు. భారత్‌పై ఆంక్షలు విధించే బదులు, అమెరికా అధికారులు ఢిల్లీతో కూర్చుని అన్ని వాస్తవాలను చర్చించాలని అభిప్రాయపడ్డారు.
“రష్యాతో పోరాడేందుకు మనం చేయాల్సినవి చేస్తూనే, భారత్‌ను, ప్రపంచ చమురు మార్కెట్లను శిక్షించకుండా అమెరికా వ్యవహరిస్తుందని నేను ఆశిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. చమురుపై టారిఫ్‌లు విధించడం సరైన నిర్ణయమా కాదా అనే దానిపై తనకు పూర్తి స్పష్టత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
భారత రిఫైనరీలు ప్రాసెస్ చేస్తున్న రష్యా చమురుకు ప్రత్యామ్నాయాలను అంత సులభంగా కనుగొనలేకపోవచ్చని డైమన్ గుర్తుచేశారు. సరఫరాలో ఆకస్మిక మార్పులు చేస్తే అది భారత రిఫైనరీలకే కాకుండా విస్తృత ఇంధన మార్కెట్లకు కూడా నష్టం కలిగిస్తుందని వివరించారు. అనూహ్య పరిణామాలకు దారితీసే చర్యల కంటే, వాస్తవాలపై చర్చలు జరపడం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించేందుకు అధికారం కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో డైమన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.








