కలిసి నడిస్తేనే విజయం.. అమెరికా పర్యటనలో జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు..!
కృత్రిమ మేధ విషయంలో కలిసికట్టుగా పనిచేయాలని అమెరికా అధినేత ట్రంప్ కు.. షీ జిన్ పింగ్ సూచించారు. అమెరికా పర్యటనలో షీ .. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ మనుషుల నియంత్రణలోనే ఉండాలని.. అందుకు అమెరికా, చైనా కృషి చేయాలన్నారు.‘‘కృత్రిమ మేధను మానవాళి మేలు కోసం అభివృద్ధి పరచి, మానవ ప్రమేయంతో నియంత్రించాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని గురువారం శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నుద్దేశించి అన్నారు.
కృత్రిమ మేధ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో ఉండిపోయేలా చూడాలని తాను, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కోరుకుంటున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా మూడురోజుల అధికారిక పర్యటన కోసం షీ జిన్‌పింగ్ అమెరికా చేరుకున్నారు. అమెరికా చైనాలు భాగస్వాములుగా ఉండాలే తప్ప శత్రువులుగా కాదని ఈ సందర్భంగా షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.
‘‘చైనా అమెరికాలు గొప్ప దేశాలు. ఇరుదేశాల ప్రజల ప్రయోజనాలు పరస్పరం పెనవేసుకొని ఉన్నాయి. కొత్త యుగంలో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు ఇరుదేశాలూ ఒక మార్గాన్ని కనుక్కోవాల్సి ఉందన్నారు. మన మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కానీ అది పరిమితులకు లోబడే ఉండాలి. ఇది ఒకరిని దాటిపోయేందుకు మరొకరు ప్రయత్నించే పరుగుపందెంలా ఉండాలే తప్ప ఒకరు ఓడి మరొకరు గెలిచే మల్లయుద్ధం కాకూడదు. రానున్న ఐదేళ్లలో చైనాలో చదువుకునేందుకు లక్ష మంది అమెరికన్ యువతకు ఇదే మా ఆహ్వానం. పరస్పర సహకారంతో అమెరికా, చైనా ప్రయోజనం పొందవచ్చు, ఘర్షణలతో ఇరుపక్షాలకూ నష్టమే’’ అని జిన్‌పింగ్ అన్నారు.
ఇవి కూడా చదవండి
జిన్‌పింగ్ దంపతులకు అరుదైన అనూహ్య ఘనస్వాగతం లభించింది. ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్‌లు మెరీల్యాండ్‌లోని జాయింట్ యాండ్రూస్ సైనిక విమానాశ్రయంలో స్వయంగా షీ జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్‌లకు స్వాగతం పలికారు. జిన్‌పింగ్ స్వాగతం కోసం 100 అడుగుల రెడ్‌కార్పెట్ ఏర్పాటు చేశారు. అమెరికా, చైనా జాతీయ జెండాల రెపరెపల మధ్య మిలిటరీ బ్యాండ్ సంగీతం వినిపిస్తుండగా ట్రంప్, జిన్‌పింగ్‌లు పక్కపక్కన నిల్చున్న సమయంలో.. రెండు బీ-1 బాంబర్లు గాల్లో విన్యాసాలు చేశాయి. విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ వద్ద ఆరు ఎఫ్-22 యుద్ధ విమానాలు, ఆరు ఎఫ్-16 విమానాలు రన్‌వేపై బారులు తీరాయి. అట్లాంటా జంతుప్రదర్శనశాలకు రెండు పండాలను బహూకరిస్తున్నట్టు జిన్‌పింగ్ వెల్లడించారు.
అమెరికా చైనాలు తమ వాణిజ్య యుద్ధ విరామాన్ని మరో రెండు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించాయి. ఈ విరామ సమయంలో విస్తృతమైన ఆర్థిక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. పోటాపోటీగా ఒకరిపై ఒకరు సుంకాలు విధించుకున్న అమెరికా చైనాలు తమ వాణిజ్య యుద్ధాన్ని ఏడాది పాటు పక్కనపెట్టాలని జిన్‌పింగ్, ట్రంప్‌లు గత సంవత్సరం అక్టోబరులో దక్షిణ కొరియాలో జరిగిన ఒక సమావేశంలో నిర్ణయించారు. నాటి ఒప్పందానికి రానున్న నవంబరులో కాలం చెల్లనున్న నేపథ్యంలో దాన్ని జనవరి 10 వరకూ పొడిగించాలని నిర్ణయించినట్లు బెసెంట్ తాజాగా వెల్లడించారు. వచ్చే జనవరి కల్లా ఇరుదేశాలూ మరింత విస్తృతమైన ఆర్థిక ప్యాకేజీపై ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి తెలిపారు.








