ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఫైర్ సైడ్ చాట్ లో మంత్రి లోకేష్
స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరికం నిర్మూలన
అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు స్పీడ్ ఏపీ కల్చర్ గా మారింది
ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయడమే ప్రథమ ప్రాధాన్యత
2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ
క్వాంటంతో పాటు హార్టికల్చర్, ఆక్వాకల్చర్ కూడా ముఖ్యమే
అక్టోబర్ 2న హార్టికల్చర్ మిషన్ ను ప్రారంభిస్తున్నాం
ఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఫైర్ సైడ్ చాట్ లో మంత్రి లోకేష్
న్యూఢిల్లీ: స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుంది. అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు స్పీడ్ ఏపీ కల్చర్ గా మారింది. స్పీడ్ ఈజ్ మనీ.. టైం ఈజ్ మనీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సర్ణాంధ్ర@2047’ (Andhra Pradesh-Swarna Andhra@ 2047:The New Growth Laboratory) అంశంపై నిర్వహించిన ‘ఫైర్‌సైడ్ చాట్’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ వ్యవహరించారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రతి రాజకీయ పార్టీకి ఓ కల్చర్ ఉంటుంది. ప్రభుత్వాలకు కూడా ఉంటుంది. ఆ కల్చర్ నాయకత్వం నుంచి వస్తుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ కల్చర్. ఆ వేగాన్ని మేం ఇప్పుడు క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాం. ప్రతిఒక్కరూ వేగాన్ని ఎలా అందుకోవాలని ఆలోచిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో కూడా ఫైళ్లను ఎంత వేగంగా పరిష్కరిస్తున్నారనే అంశంపై చర్చ జరుగుతుంది. దీనిపై మంత్రులకు ర్యాంకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధానం బ్యూరోక్రసీ స్థాయిలో కూడా ఉంటుంది.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ ప్రత్యేకత
పెట్టుబడులను ఆకర్షణలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ ప్రత్యేకత. పొరుగు రాష్ట్రాల్లో దశాబ్దానికి పైగా నిలిచిపోయిన ప్రాజెక్టులను ఏపీలో 18 నెలల్లోపే ప్రారంభించగలిగాం. 13 నెలల్లోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ను తీసుకువచ్చాం. విధానాల విషయంలో కూడా ఇదే వేగం అవసరం. టెక్నాలజీ చాలా వేగంగా మారుతోంది. వేగవంతమైన పురోగతి జరుగుతోంది. సాధారణంగా విధానాలు టెక్నాలజీ కంటే ఒక అడుగు వెనుకే ఉంటాయి. విధానాలు కూడా తమను తాము మార్చుకునేందుకు మంత్రుల పాత్ర, బ్యూరోక్రాట్ల పాత్ర కీలకమవుతుంది. పౌరులకు వేగంగా సేవలందించేందుకు ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకువచ్చాం. దాదాపు వెయ్యి పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. టెక్నాలజీని విస్తృతంగా ఎలా ఉపయోగిస్తున్నామో చెప్పడానికి ఇదో ఒక గొప్ప ఉదాహరణ. అందువల్ల స్పీడ్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సంస్కృతిగా మారింది. ఇది వ్యవసాయం నుంచి తయారీ రంగం వరకు, పాలన నుంచి ఐటీ వరకు అన్ని రంగాల్లో మార్పును తీసుకొస్తోంది. సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో మేం తీసుకొచ్చిన ప్రధాన సాంస్కృతిక మార్పు ఇదే.
రాష్ట్రవ్యాప్తంగా 23 ప్రత్యేక క్లస్టర్ల అభివృద్ధి
రాష్ట్రంలో 23 ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. అవి స్పేస్, డ్రోన్లు, సిమెంట్, స్టీల్, మెడికల్ డివైసెస్, ఫార్మా, ఏఐ, డేటా నుంచి హార్టికల్చర్, ఆక్వా రంగాల వరకు విస్తరించాయి. వర్టికల్, హారిజాంటల్ విధానంలో ముందుకు వెళ్తున్నాం. ఒక పూర్తిస్థాయి నౌకను తయారు చేయడానికి సుమారు 360 కంపెనీల అవసరం ఉంటుంది. ఫైర్‌ఫైటింగ్ పరికరాలు, నావిగేషన్ పరికరాలు, లైటింగ్, మెటీరియల్ సైన్సెస్ వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీలు కలిసి ఒక షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌ను తయారు చేస్తాయి. ఇలాంటి 23 క్లస్టర్లను మేం అభివృద్ధి చేస్తున్నాం. వీటిని వర్టికల్స్ అంటారు. ఇక హారిజాంటల్ విధానంలో మానవ వనరుల అభివృద్ధి విభాగం వస్తుంది.
ఆయా క్లస్టర్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉంది. సర్టిఫికేషన్, టెస్టింగ్, వాలిడేషన్ వ్యవస్థలను కూడా అభివృద్ధి చేయాలి. స్కైరూట్ ఇందుకు ఉదాహరణ. ఏడాది క్రితమే మేం స్కైరూట్పై నమ్మకం ఉంచాం. వారికి 300 ఎకరాల భూమిని ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చాం. వారు తమ ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి, మన లాంచ్‌ప్యాడ్‌కు సమీపంలో తమ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ భూమిని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా స్పేస్ సిటీని నిర్మిస్తున్నాం. అదే విధంగా సాగర్ డిఫెన్స్ అనే మరో సంస్థతో కూడా ఇదే విధానాన్ని అనుసరించాం. వారు సముద్ర సంబంధిత డ్రోన్లను తయారు చేస్తున్నారు. వారు మా వద్దకు వచ్చినప్పుడు వారి విలువ సుమారు రూ.3వేల కోట్లు ఉండేది. ఇప్పుడు అది రూ.23 వేల కోట్లకు చేరింది. ఈ మార్పు కేవలం 18 నుంచి 24 నెలల్లోనే జరిగింది. క్లస్టర్ ఆధారిత విధానం గొప్ప ఫలితాలను ఇస్తోంది.
స్పీడ్ ఈజ్ మనీ.. టైం ఈజ్ మనీ
ఎవరూ ఇంకా పెద్దగా దృష్టి పెట్టని, ప్రారంభ దశలో ఉన్న కంపెనీలను గుర్తించి ముందుగానే వాటిపై పెట్టుబడి రూపంలో నమ్మకం ఉంచగలుగుతున్నాం. కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలను కూడా ముందుగానే సంప్రదిస్తున్నాం. రాష్ట్రంగా మేం వారికి మద్దతు ఇస్తున్నాం. అవసరమైన ప్రక్రియలు సక్రమంగా పూర్తైన తర్వాత ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ఆ తర్వాత వారు తమ సత్తాను చూపిస్తున్నారు. అదే విధానాన్ని ఆర్సెలర్ మిట్టల్ విషయంలో కూడా అనుసరించాం. 3వేల ఎకరాల భూమిని ఇచ్చాం. వారు తమ పనులను ప్రారంభించారు. 17 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. అసాధ్యాన్ని మేం సుసాధ్యం చేశాం. ఆదిత్య మిట్టల్ తో జూమ్ కాల్ నుంచి ప్రాజెక్టు గ్రౌండింగ్ వరకు పట్టిన కాలం 17 నుంచి 18 నెలలు మాత్రమే. పర్యావరణ అనుమతులు సహా అన్ని ప్రక్రియలను పూర్తి చేశాం. ఫలితాలపై దృష్టిపెట్టి పనిచేస్తున్నాం. ఇదే మమల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఎందుకంటే స్పీడ్ ఈజ్ మనీ, టైం ఈజ్ మనీ
ఇవి కూడా చదవండి
ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయడమే ప్రథమ ప్రాధాన్యత
ప్రాజెక్టుల గ్రౌండింగ్ ను నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నా. సమస్యలు ఏవైనా ఉంటే కలిసి పరిష్కరిస్తాం. కాబట్టి స్పీడ్ ను ప్రభుత్వ కల్చర్ గా మార్చడం, దానికి క్లస్టర్ ఆధారిత విధానాన్ని జోడించడం.. ఈ రెండూ కలిసి మనం ఈరోజు సాధిస్తున్న విజయాలకు కారణం అవుతున్నాయి. ప్రాజెక్టులను గ్రౌండ్ చేయడం మా ఏకైక ప్రధాన ప్రాధాన్యత. మేం కేవలం ఎంవోయూలపై ఆధారపడబోం. నాకు ఎంవోయూలపై సంతకం చేయడం అంతగా ఇష్టం లేదు. పార్టనర్షిప్ సమ్మిట్‌లో కొన్ని ఎంవోయూలు చేసుకున్నాం. కానీ మేం 80 శాతం గ్రౌండింగ్ లక్ష్యంగా పెట్టుకున్నాం. 80 శాతం కంటే తక్కువ గ్రౌండింగ్ రాష్ట్రానికి ఆమోదయోగ్యం కాదని చెప్పాను. ఎందుకంటే ప్రాజెక్టు ఎంత త్వరగా గ్రౌండ్ అవుతుందో, అంత త్వరగా పన్నులు చెల్లిస్తారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అనే లక్ష్యం మరింత చేరువ అవుతుంది.
సమగ్ర అభివృద్ధి ఏపీ లక్ష్యం
అందరికీ పీపీపీ మోడల్ తెలుసు. ఏపీలో పీ-4 మోడల్ అమలుచేస్తున్నాం. ప్రజలను నాలుగో భాగస్వామిగా చేర్చాం. అభివృద్ధి ప్రయాణంలో పేదలు, వెనుకబడిన వర్గాలను విస్మరించకూడదు. మేం మరింత సమగ్ర అభివృద్ధి కోరుకుంటున్నాం. కేవలం నగదు ఇవ్వడం పరిష్కారం కాదని మేం విశ్వసిస్తున్నాం. ఆలోచనలు, అనుభవం, అవకాశాల పరిచయం కూడా అంతే ముఖ్యమైనవి. ఇక్కడ పరిశ్రమలు కీలక పాత్ర పోషించాలి. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ప్రజలకు కొత్త అవకాశాలను పరిచయం చేయాలి. ఏపీలోని నియోజకవర్గాల్లో దీనివల్ల అద్భుతమైన మార్పులను చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇటీవల తన నియోజకవర్గానికి వెళ్లి తిరిగి వస్తూ ఒక విషయం మాతో పంచుకున్నారు. ఏడాది క్రితం వరకు ఇటుకల బట్టీలో పనిచేసిన ఒక మహిళ ఇప్పుడు అదే వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆమె ప్రస్తుతం 20 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఆమెకు పెట్టుబడిగా అవసరమైనది కేవలం రూ.60వేలు మాత్రమే. కానీ అంతకంటే ముఖ్యంగా ఆమెకు బుక్కీపింగ్ ఎలా చేయాలి? కొత్త మార్కెట్లను ఎలా అన్వేషించాలి? ఉత్పత్తిని ఎలా అమ్మాలి? మార్కెటింగ్ ఎలా చేయాలి? అనే విషయాల్లో మార్గదర్శకత్వం అవసరమైంది. అక్కడే నిజమైన విలువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. మనమందరం మన అనుభవాల ఫలితమే. బిజినెస్ స్కూల్లో నేర్చుకునే దానికంటే, జీవిత ప్రయాణంలో మనం చాలా ఎక్కువ నేర్చుకుంటాం. ఆ అనుభవాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. కంపెనీలు పాఠశాలలను దత్తత తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఇదే మేం అమలుచేస్తున్న పీ-4 మోడల్.
రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే దేశం గెలుస్తుంది
రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కూడా ఉండాలి. రాష్ట్రాలు పోటీ పడితే, భారతదేశం గెలుస్తుంది. నేను దీనిని పూర్తిగా విశ్వసిస్తా. ఈ కార్యక్రమం తర్వాత నేను గుజరాత్‌కు వెళ్తున్నాను. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాను. అదే విధంగా గుజరాత్ వాళ్లు కూడా ఆక్వా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్‌కు రావచ్చు. ఇదే విధంగా మనం పనిచేయాలి. ఒక రాష్ట్రం ఏదైనా కొత్తగా చేసి మంచి ఫలితాలు సాధిస్తే, ఇతర రాష్ట్రాలు త్వరగా నేర్చుకుంటాయి.
2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ
వచ్చే పదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందే ఉద్యోగ రంగాల విషయానికి వస్తే.. ఏపీలో 23 క్లస్టర్లు ఉన్నాయి. సాంప్రదాయ తయారీ రంగాలైన సిమెంట్ నుంచి ఆటోమొబైల్, మెటీరియల్ సైన్సెస్ వరకు విస్తృతమైన రంగాలు ఉన్నాయి. రాష్ట్రంలో రేర్ ఎర్త్, మినరల్ క్లస్టర్ కూడా అభివృద్ధి చెందుతోంది. బయోమెడికల్, ఫార్మా, ఏఐ, డేటా సెంటర్లు వంటి రంగాలు కూడా ఉన్నాయి. గూగుల్ ఏపీలో భారీ పెట్టుబడులు పెడుతోంది. దాని తర్వాత మరికొన్ని పెట్టుబడులు కూడా వస్తున్నాయి. క్వాంటం టెక్నాలజీ కూడా రాష్ట్రానికి వస్తోంది. అమరావతిలో క్వాంటమ్ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఐబీఎం నుంచి ప్రపంచంలోని తొలి 150-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడానికి కృషిచేస్తున్నాం. కేవలం కంప్యూటర్ను తీసుకురావడమే కాదు… పూర్తి క్వాంటం ఎకోసిస్టమ్ ను నిర్మిస్తాం. తయారీ రంగం విషయానికి వస్తే.. క్రయోజెనిక్స్, మెటీరియల్ సైన్సెస్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలి. క్వాంటం టెక్నాలజీకి సంబంధించిన వినియోగాలను అభివృద్ధి చేయాలి. హాస్పిటాలిటీ రంగం కూడా అంతే ముఖ్యమైనది. రాష్ట్రంలో సుమారు 50వేల హోటల్ రూమ్ లను నిర్మిస్తున్నాం. అందువల్ల ఈ రంగంలో కూడా భారీ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం.
అక్టోబర్ 2న హార్టికల్చర్ మిషన్ ను ప్రారంభిస్తున్నాం
క్వాంటం ఎంత ముఖ్యమో, హార్టికల్చర్ కూడా అంతే ముఖ్యం. ఆక్వాకల్చర్ కూడా అంతే ముఖ్యం. అక్టోబర్ 2న హార్టికల్చర్ మిషన్ ను ప్రారంభిస్తున్నాం. దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో రానున్నాయి. పరిశోధన కూడా ముఖ్యమే. హైదరాబాద్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నట్లే, ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అదే నమూనాను వ్యవసాయ రంగానికి అనుసరిస్తున్నాం. అందువల్ల మా దృష్టిలో హార్టికల్చర్ నుంచి అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ నుంచి క్వాంటమ్ వరకు.. మొత్తం 23 రంగాలు ముఖ్యమైనవే.
స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరికం నిర్మూలన
2047 నాటికి సాధారణ ఏపీ పౌరుడి జీవితం ఎలా ఉంటుందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఒక తరంలోనే మనం పేదరికాన్ని నిర్మూలించగలమని నా నమ్మకం. ఒక తరం అంటే దాదాపు ఒక దశాబ్దం. ఒక దశాబ్దం పాటు స్థిరమైన, నిరంతరాయమైన ప్రభుత్వం ఉంటే పేదరికాన్ని నిర్మూలించగలం. ఏపీలో మా ఏకైక ప్రధాన లక్ష్యం ఉద్యోగాల కల్పన. అదే మా సింగిల్ అజెండా అని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పోరేట్ అఫైర్స్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అర్జిత్ సేన్, సెల్ కాన్ గ్రూప్ ఫౌండర్, డైరెక్టర్ ఆర్.మురళీకృష్ణ, డీజీఏ గ్రూప్ పార్టనర్ అండ్ హెడ్ ఆఫ్ ఇండియా ఆఫీస్ సునీతా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.








