ఎపిలో వైద్యపరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
అబాట్ ఇండియా ఎండి ఇస్తేయాక్ అంజాద్ తో మంత్రి లోకేష్ భేటీ
న్యూఢిల్లీ: యుఎస్ఎకి చెందిన ప్రముఖ మెడికల్ డివైసెస్, డయాగ్నస్టిక్స్, న్యూట్రిషన్, ఫార్మాస్యూటిక్స్ తయారీ సంస్థ అబాట్ (Abbott) మేనేజింగ్ డైరక్టర్ ఇస్తేయాక్ అంజాద్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లోని AMTZ/EMCలలో ఒకచోట వైద్య పరికరాలు / డయాగ్నోస్టిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. నక్కపల్లిలో రాబోయే బల్క్ డ్రగ్ పార్క్‌లో జెనరిక్ మందుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రతిపాదించారు. ఈ పార్క్‌లో అనుకూలమైన భూమి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వినియోగ సేవలు, ఇతర రాష్ట్రాలకు మించిన విధానపరమైన మద్దతు ఉంటాయని తెలిపారు. విశాఖపట్నంలో అబాట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అబాట్ ఎండి అంజాద్ మాట్లాడుతూ… తమ సంస్థ భారత్ లో 400కు పైగా ఫార్మా బ్రాండ్లు, 12వేలకు పైగా ఉద్యోగులను కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుతం గోవా, బద్ది (హిమాచల్ ప్రదేశ్), ఝగాడియా (గుజరాత్)లలో తయారీ కేంద్రాలు, ముంబై, న్యూఢిల్లీలలో కార్యాలయాలు ఉన్నట్లు చెప్పారు. పోషకాహారం (nutrition), ఫార్మా ఉత్పత్తుల కోసం స్థానిక పేరెన్నికగన్న తయారీసంస్థల్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అంజాద్ చెప్పారు.








