ఏపీలో ఇంజనీరింగ్ సెంటర్, జిసిసి ఏర్పాటు చేయండి.. సిస్కో ఇండియా ఎండి హరికృష్ణన్ తో మంత్రి లోకేష్ భేటీ
న్యూఢిల్లీ: గ్లోబల్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ, కొలాబరేషన్ & ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పేరెన్నికగన్న సిస్కో సిస్టమ్స్ (యుఎస్ఏ) మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా & సౌత్ ఈస్ట్ ఆసియా) హరీష్ కృష్ణన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… డేటా సెంటర్ ఎకోసిస్టమ్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో భారీ ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను (ఎకానమీస్ ఆఫ్ స్కేల్) సాధించడానికి, డేటా సెంటర్ వాల్యూ చైన్ మొత్తం వ్యవస్థను రాష్ట్రంలోకి ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. డేటాసెంటర్ల డిమాండ్ కు అనుగుణంగా ఎపిలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్ (UCS) సర్వర్లు, స్విచ్లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ సెంటర్/జీసీసీని ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. సిస్కో ఇండియా ఎండి హరీష్ కృష్ణన్ మాట్లాడుతూ… భారతదేశంలో 8,000 మందికి పైగా ఇంజనీర్లతో సహా 16,000 మందికి పైగా సిబ్బంది, 1,000కి పైగా పేటెంట్లు — కీలకమైన ఇంజనీరింగ్ విభాగాలను సిస్కో కలిగి ఉందని తెలిపారు. చెన్నయ్ లోని తయారీ ప్లాంట్ ద్వారా 1 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు, దేశీయ అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 50వేలమంది యువతను నెట్అకాడ్ యాక్సెస్, ఐటీ, ఇతర పరిశ్రమల్లో అత్యంత నైపుణ్యం గల శ్రామిక శక్తిగా అభివృద్ధి చేయడానికి ఎపి ప్రభుత్వంతో గత ఏడాది మార్చిలో ఒప్పందం చేసుకున్నాం, ఈ ప్రోగ్రామ్ ఇప్పటికే అమలులో ఉందని తెలిపారు. విశాఖపట్నంలో ఇన్నోవేషన్ సెంటర్, తిరుపతిలో సీఓఈ, విజయవాడ స్మార్ట్ సిటీ, ఏపీ ఫైబర్నెట్ (22,500 కి.మీ.) ప్రాజెక్టుల్లో తాము భాగస్వామ్యం వహించినట్లు చెప్పారు. ఎపి ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.








