ఏపీలో కాంపొనెంట్స్ తయారీ పార్కు అభివృద్ధి చేయండి : మంత్రి లోకేష్
వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ తో మంత్రి లోకేష్ భేటీ
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్, యాక్సెసరీస్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ (గవర్నమెంట్ ఎఫైర్స్ & స్ట్రాటజిక్ ఎంగేజ్ మెంట్)తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్స్ రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో వివో మొబైల్స్ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వివో సరఫరాదారుల కోసం ఒక ‘కాంపోనెంట్స్ తయారీ పార్క్’ను అభివృద్ధి చేయాలని కోరారు. వివో, దాని అనుబంధ సంస్థల vendor ecosystem కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి ఒక ‘సప్లై చైన్ సమావేశాన్ని’ నిర్వహించాలని మంత్రి లోకేష్ సూచించారు. వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ మాట్లాడుతూ… వివో మొబైల్ ఇండియా ప్రతిఏటా 154.2 మిలియన్ యూనిట్ల మొబైల్ యూనిట్లను తయారీ చేస్తూ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో 2025నాటికి అగ్రగామిగా ఉందని తెలిపారు. దేశంలో విక్రయించే ఫోన్లలో 99శాతానికి పైగా (మదర్‌బోర్డులు, 90% పైగా బ్యాటరీలు, ఛార్జర్లతో సహా) గ్రేటర్ నోయిడాలోనే తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని అర్జిత్ సేన్ తెలిపారు.








