రాష్ట్రంలో భారీ వర్షాలు .. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీ సెంటర్ నుంచి అధికారులతో రివ్యూ
నదులకు వస్తోన్న ప్రవాహాలు, యంత్రాంగం సన్నద్దతపై చర్చ
రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు ఉంటాయని అంచనా
సమర్ధ నీటి నిర్వహణతో రిజర్వాయర్లను నింపాలని సూచన
జన జీవనానికి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం ఆదేశం
అమరావతి, సెప్టెంబరు 24: వర్షాల కారణంగా వస్తున్న ప్రవాహాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు పరిధిలో ఉన్న వివిధ నీటి వనరుల్ని కూడా నింపాలని స్పష్టం చేశారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావంపై సీఎం చర్చించారు. తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భజలాలు కొంత మేర పెరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రకాశం బ్యారేజి సహా మున్నేరు సహా ఇతర క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అన్నారు. ప్రాజెక్టుల దిగువన ఉన్న అన్ని నీటి వనరుల్లో వర్షపు నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అవసరమైన చోట మోటార్లను వాడి నీటిని లిఫ్ట్ చేయాలని స్పష్టం చేశారు. గోదావరి నుంచి వస్తున్న ప్రవాహాల ద్వారా 24 టీఎంసీల నీటిని ఏలేరు రిజర్వాయర్ నింపాలని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ నీటి వనరుల్లోకి నీటిని పంపాలన్నారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాలు అధికంగా నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ సహా వివిధ జిల్లాల్లో తీవ్ర వర్ష ప్రభావం కనిపించిందని తెలిపారు.
గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార బేసిన్లపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు, గాలుల తీవ్రత, నదులు–వాగుల్లో పెరుగుతున్న ప్రవాహాలు, రిజర్వాయర్లలోకి చేరుతున్న వరద నీరు, రాబోయే రోజుల్లో అంచనా వేసిన వర్షపాతంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. తాజా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో గోదావరి బేసిన్‌లోని శబరి, ఇంద్రావతి, ఏలేరు, తాండవ, ఎర్రకాల్వ, పంపా, మేఘాద్రిగడ్డ తదితర రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏలేరు రిజర్వాయర్‌కు 21,200–26,500 క్యూసెక్కుల మేర, తాండవకు 6,000–7,500 క్యూసెక్కులు, మేఘాద్రిగడ్డకు 2,400–3,000 క్యూసెక్కులు, పంపాకు 3,100–3,875 క్యూసెక్కులు వరకు ఇన్‌ఫ్లో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తా రిజర్వాయర్లకు కూడా రాబోయే రోజుల్లో ఇన్‌ఫ్లో గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. నాగావళి–వంశధార బేసిన్లలో వర్షాల ప్రభావంతో ప్రవాహాలు పెరగనున్నాయని వివరిచారు. గొట్టా బ్యారేజీకి సెప్టెంబర్ 25 ఉదయం నాటికి వార్నింగ్ లెవల్–1 చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. భద్రాచలం వద్ద సెప్టెంబర్ 26 మధ్యాహ్నానికి వార్నింగ్ లెవల్–1, అదే రోజు రాత్రికి వార్నింగ్ లెవల్–2 దాటే అవకాశం ఉందని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సెప్టెంబర్ 27 ఉదయం వార్నింగ్ లెవల్–1, సాయంత్రం వార్నింగ్ లెవల్–2 దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. శబరి నదిపై కుంటా వద్ద సెప్టెంబర్ 26 ఉదయానికి వార్నింగ్ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ప్రకృతి వ్యవసాయం చేయాలి… భూసారాన్ని పెంచాలి
ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులను మార్చడం సాధ్యం కాకపోయినా.. వాటి ప్రభావాన్ని తగ్గించేలా అంతర్గత పరిస్థితులను మార్చుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, బయోచార్, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్‌గా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. వ్యవసాయానికి సంబంధించిన సమాచారంతో పాటు సాగునీటి లభ్యత, రిజర్వాయర్ల పరిస్థితి తదితర వివరాల డేటా పొందుపరచాలని ఆదేశించారు. అక్టోబరు 2 తేదీన ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేయనున్నామని, అదే రోజు రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. మైక్రోసాఫ్ట్ సహకారంతో రూపొందించిన ఏఐ స్టాక్ ద్వారా కలిగే లాభాలను వివరిస్తూ డెమో ఇవ్వాలని సీఎం సూచించారు. భూగర్భజలాలు సహా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలపైనా అమెరికాలోని పృథ్వీ అనే యువకుడు రూపోందించిన యాప్ లను సీఎం పరిశీలించారు. వివిధ శాఖల నుంచి సేకరించిన డేటా సెట్లను సమన్వయం చేసుకుంటూ నాసా ఉపగ్రహ చిత్రాలను అనుసంధానం చేస్తూ ఈ యాప్ ను రూపొందించిన పృథ్విని సీఎం అభినందించారు. భూగర్భజలాల స్థాయిలు, వాటి మార్పులు, ప్రాంతాల వారీ పరిస్థితులను విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో నీటి నిర్వహణకు మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
శాప్ ద్వారా క్రీడా క్యాలండర్
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ టారిఫ్‌ను పెంచకపోయినా సేవల్లో లోపాల కారణంగా ప్రజల్లో సంతృప్తి తగ్గుతోందని, సరఫరా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 287.214 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉన్న నేపథ్యంలో.. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటి లభ్యతపైనా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత ధరలు, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. శాప్ ఆధ్వర్యంలో ఏడాది క్రీడా క్యాలెండర్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయిలోనూ క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును మెరుగుపరిచేలా స్పష్టమైన సూచనలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నోడల్ అధికారుల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి పనితీరులో మార్పు తీసుకురావాలని ఆదేశించారు. గృహనిర్మాణంలో జీరామ్‌జీ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టాలని సీఎం సూచించారు. డేటా ఆధారిత పాలనలో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఏఐ లివింగ్ ల్యాబ్స్ యాప్‌ల వినియోగం, సమాచార విశ్లేషణను మరింత విస్తరించాలని సీఎం స్పష్టం చేశారు.








