సిరిసిల్ల, సిద్దిపేటలపై రేవంత్ గురి!
రేవంత్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ అగ్రనేతల సొంత నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీష్ రావు నియోజకవర్గాల్లో పాగా వేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారు. అందుకు తగ్గట్టు ప్రత్యేక కార్యచరణ చేపట్టారు.
గత రెండు దశాబ్దాలుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబీలకు కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో పాగా వేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో సెప్టెంబర్ 30న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సిరిసిల్లలో పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆయన సుమారు 4 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
అంతేకాకుండా.. అక్టోబర్ నెలలో మరో కీలక నేత హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలోనూ రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. అనంతరం.. కేసీఆర్ ఫాంహౌస్ భూములపై 30 రోజుల్లోగా నివేదిక వచ్చిన తర్వాత ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కూడా రేవంత్ రెడ్డి సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ నియోజకవర్గాల్లో పర్యటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ప్రత్యక్ష రాజకీయ సవాల్ విసురుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పర్యటనల వెనుక కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం దాగి ఉంది. సిరిసిల్లలో కేటీఆర్, సిద్ధిపేటలో హరీశ్ రావు చాలా కాలంగా తమ నియోజకవర్గాల్లో పటిష్టమైన రాజకీయ పట్టును కలిగి ఉన్నారు. అక్కడి స్థానిక సంస్థలపై, పార్టీ కేడర్‌పై వారికి గట్టి పట్టు ఉంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలప్రదర్శన చేయడం ద్వారా ఆ ఇద్దరు సీనియర్ నాయకులను కేవలం వారి సొంత నియోజకవర్గాలకే పరిమితం చేయాలని చూస్తోంది. వారు రాష్ట్రవ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి లేదా పార్టీని సమన్వయం చేయడానికి సమయం కేటాయించకుండా, సొంత గడ్డపైనే నిమగ్నమయ్యేలా చేయడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం.
ఇవి కూడా చదవండి
నకిరేకల్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు గట్టి సవాల్ విసిరారు. ఈసారి ఈ నియోజకవర్గాల్లో దమ్ముంటే కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేటలపై దృష్టి పెట్టడం వెనుక మరో కోణం కూడా ఉంది. ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత బలాన్ని పెంచుకోవడం, స్థానిక నాయకులను రాజకీయంగా మరింత చురుగ్గా మార్చడం, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన నాయకత్వ నిర్మాణాన్ని సిద్ధం చేయడం దీని లక్ష్యం.
భూ వివాదాలు, ఇతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీలను ఏర్పాటు చేయడం, దానికి ప్రతిగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుండటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ లపై రేవంత్ ప్రత్యేక ఫోకస్ పెట్టడం ఈ రాజకీయాన్ని మరింత రంజుగా మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.








