రేవంత్ పాలనపై కోమటిరెడ్డి మరోసారి విమర్శలు!
సొంత పార్టీ ప్రభుత్వమే లక్ష్యంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని, ఆయన నిర్వహిస్తున్న శాఖలోనే వేల కోట్ల అవినీతి చోటుచేసుకుంటుందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రాజెక్టుల టెండర్లలో భారీ అవినీతి జరుగుతోందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. బద్వేల్ నుంచి కొడంగల్ వరకు చేపట్టిన రేడియల్ రోడ్డు మూడు ప్యాకేజీలకు తమ కుటుంబానికి చెందిన ‘సుశీ హైటెక్’ కంపెనీ తక్కువ ధరకే టెండర్ వేసిందని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో, ముఖ్యంగా చైనా సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ మూవ్మెంట్ కోసం ఎల్ అండ్ టీ లాంటి దిగ్గజ కంపెనీలే చేయలేని 252 కిలోమీటర్ల రోడ్డును సింగిల్ వర్క్‌గా పూర్తి చేసిన ఘనత తమ సంస్థకు ఉందని గుర్తుచేశారు.
అటువంటి అపారమైన అనుభవం ఉన్న తమ కంపెనీని కేవలం కౌంటర్ సైన్ లేదనే సాకుతో రాత్రికి రాత్రి అర్హత లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ రీజినల్ ఆఫీస్ నుంచి ఎస్ఈ తరఫున పత్రం తెచ్చిచ్చినా పట్టించుకోకుండా, ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్స్, బీవీఎస్ఆర్, జీకేసీ వంటి కంపెనీలకు ఎక్కువ రేట్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారని మండిపడ్డారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.650 కోట్లు అదనపు భారం పడిందని, ప్రజల సొమ్మును ఆంధ్రా కంపెనీలకు దోచిపెడుతున్నారని ఆయన నేరుగా సీఎంను టార్గెట్ చేశారు.
తమ కంపెనీ టెండర్లు వేయొద్దని రెండేళ్ల కిందటే సీఎం ఆఫీస్ నుంచి చెప్పించారని, ఈసారి కూడా ఎవరూ టెండర్లు వేయవద్దని ముందే ఆదేశాలు వచ్చాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తక్కువ రేట్లకు పనులు చేసే వారికి అవకాశం ఇవ్వకుండా, ఎక్కువ రేట్లకే పనులు అప్పగించడం ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేయడమే కొందరి లక్ష్యంగా మారిందని ఆయన విమర్శించారు. మునుగోడు అభివృద్ధికి నిధులు అడిగితే డబ్బుల్లేవని చెప్పే ప్రభుత్వం, అప్పు తెచ్చిన డబ్బును ఇలాంటి వాటికి తగలేస్తోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ, ప్రభుత్వంలో జరుగుతున్న ఈ దోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్కూళ్లు, ఆస్పత్రులు లేక, నిరుద్యోగ భృతి అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే, జీహెచ్ఎంసీ పరిధిలో వేల కోట్ల దోపిడీ జరగడం దారుణమన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రాహుల్ గాంధీకి ప్రత్యక్షంగా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటూ ఈ అవినీతిపై పోరాటం చేస్తానని, బద్వేల్-కొడంగల్ రోడ్డు టెండర్లపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని హెచ్చరించారు.
ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర ఇరుకున పెట్టేలా కనిపిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేనే సీఎంపై, ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా అవినీతి ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. గత కొంతకాలంగా పార్టీలో సమన్వయ లోపాలు, మంత్రివర్గ విస్తరణ, పదవుల కేటాయింపులపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా తనకు మంత్రి పదవి రాలేదనే కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో మొదటి నుంచి ఉంది. పలు సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. అందులో భాగంగానే ఆయన సమయం చిక్కినప్పుడుల్లా ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.








