కేబీఆర్ పార్క్ ఎలివేటెడ్ కారిడార్‌కు లైన్ క్లియర్!
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ గతంలో ప్రతిపాదించిన హెచ్‌సీటీ ప్రాజెక్ట్‌లో వ్యూహాత్మక మార్పులు చేస్తూ రూ.1,090 కోట్ల భారీ అంచనా వ్యయంతో నూతన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు సుమారు 4.3 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్ట్.. బంజారాహిల్స్ నుంచి హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్ వైపు వెళ్లే ఐటీ ఉద్యోగులు, ప్రయాణికులకు ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కల్పించనుంది.
అయితే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే రాజకీయంగా తీవ్ర దుమారమే రేగింది. కేబీఆర్ పార్క్ చుట్టూ రవాణా వ్యవస్థ రూపకల్పనలో ప్రభుత్వం మార్పులు చేయడం వెనుక కొందరి ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం జరుగుతోందంటూ బీఆర్ఎస్ వర్గాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, జానారెడ్డి, అల్లు అర్జున్ మామ తదితరుల భూములు, ఆస్తులను కాపాడేందుకే రేవంత్ సర్కార్ వెనకడుగు వేసిందని ప్రతిపక్షాలు రాజకీయ అస్త్రంగా మలచుకున్నాయి. ఈ ఆరోపణలు, విమర్శల నడుమ ప్రాజెక్ట్ భవితవ్యంపై కొంత ఉత్కంఠ నెలకొంది.
ఈ విమర్శలకు చెక్ పెడుతూ తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. నగర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పలువురు ప్రముఖులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రభుత్వానికి భూములు అప్పగించేందుకు ముందుకు వచ్చారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 45 జంక్షన్ అభివృద్ధిలో భాగంగా.. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నివాసానికి చెందిన 862.77 చదరపు గజాల స్థలాన్ని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు అంగీకరించారు. దివంగత ఎన్టీఆర్ అభిమానులను కలిసే ఈ ప్రాంతంతో కుటుంబానికి ఎంతో భావోద్వేగ, సెంటిమెంట్ అనుబంధం ఉన్నప్పటికీ, ప్రజాహితం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ భూమిని అప్పగించడం ద్వారా.. బాలకృష్ణ వేరే ప్రాంతానికి తన నివాసాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.
అలాగే.. శబ్దాలయ స్టూడియోకి చెందిన 608 గజాల స్థలాన్ని ఆ సంస్థ అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డి టీడీఆర్ సర్టిఫికెట్ల ప్రతిపాదికన ఇచ్చేందుకు అంగీకరించారు. దీని విలువ సుమారు రూ.30.40 కోట్లు ఉంటుందని అంచనా. భవ్య కన్స్ట్రక్షన్స్కు చెందిన 341.33 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు యజమాని ఆనంద్‌ప్రసాద్ సైతం సానుకూలంగా స్పందించారు. నగరంలో రోడ్ల విస్తరణ సమయంలో నగదు పరిహారానికి బదులుగా జారీ చేసే టీడీఆర్ సర్టిఫికెట్లు భూయజమానులకు ఇతర ప్రాంతాల్లో అదనపు భవన నిర్మాణాలకు వెసులుబాటు కల్పిస్తాయి. ఇది ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
మొత్తానికి.. రాజకీయ రచ్చకు కేంద్రబిందువుగా మారిన ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు రావడం ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చింది. బీఆర్ఎస్ ఆరోపణలను పటాపంచలు చేస్తూ, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు ముందుకుసాగుతున్న తీరును ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. భూసేకరణ అడ్డంకులు తొలగిపోవడంతో ఎలివేటెడ్ కారిడార్ పనులు త్వరలోనే ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.








