జనాభా పెరుగుతుంటే.. ఓట్లు తగ్గుతాయా? రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న!
ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అధికార బీజేపీని కట్టడి చేసే ప్రతిపక్షాల అజెండాకు అస్త్రాలుగా మారాయి. ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం ద్వారా పారదర్శకతకు తూట్లు పొడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన రాజ్యాంగ సంస్థలు ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీరును తప్పుబట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
దేశ జనాభా పెరుగుతున్న తరుణంలో ఓటర్ల సంఖ్య తగ్గడం వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. 2014లో 81 కోట్లుగా ఉన్న ఓట్లు 2019 నాటికి 91 కోట్లకు చేరాయన్నారు. 2023 నాటికి 97 కోట్లకు పెరగాల్సి ఉండగా, ఇప్పటికే సుమారు 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆయన వాదిస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్, బీహార్, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల్లో ఎక్కడైతే ఓట్లు తొలగించబడ్డాయో, అక్కడే బీజేపీ విజయాలు సాధించందిని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఓటు హక్కు కోల్పోవడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందకుండా పోతాయని, ఇది పౌరుల ప్రాథమిక హక్కులపై నేరుగా జరుగుతున్న దాడి అని ఆయన హెచ్చరించారు.
ఈ మొత్తం పరిణామాలపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మౌనం వహించడం పట్ల రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ దేశంలో పౌరులను రెండు వర్గాలుగా విభజిస్తోందని, తమకు అనుకూలమైన వారిని ఉంచుకుని మిగతా వారి ఓట్లను తొలగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. దేశంలో శాశ్వత విభజనకు పునాదులు పడుతున్నాయని హెచ్చరించిన ఆయన.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇది మరో స్వాతంత్ర్య పోరాటం లాంటిదని పిలుపునిచ్చారు.








