సిద్ధిపేటలో రేవంత్ టూర్.. అప్రమత్తమైన హరీశ్!
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం ముదురుతోంది. బీఆర్ఎస్ కీలక నేతల నియోజకవర్గాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లడం, బహిరంగ సభలు నిర్వహించడం, తద్వారా స్థానిక నేతల అక్రమాలు, వైఫల్యాలను ఎండగట్టడం కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిరిసిల్ల పర్యటన పూర్తి చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, తదుపరి అస్త్రాన్ని హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేటపై ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఇటీవల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో కేటీఆర్‌కు సంబంధించిన ఆరోపణలు, అక్రమాస్తులు, హోటళ్ల అంశాలను రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రస్తావించారు. ఈ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రస్తావించిన ఆ హోటళ్లు తనవేనని కేటీఆర్ కూడా బహిరంగంగా అంగీకరించడంతో ఈ అంశం మరింత ఊపందుకుంది. ఈ క్రమంలోనే సిరిసిల్ల తరహాలోనే హరీశ్ రావు నియోజకవర్గమైన సిద్ధిపేటను కూడా టార్గెట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేట పర్యటన ఖాయమన్న సంకేతాలు వెలువడటంతో హరీశ్ రావు ముందుగానే అప్రమత్తమయ్యారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా సిద్ధిపేటలో ఆయన భారీ సభ నిర్వహించారు. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చినా మిగిలిన చోట్ల ఆశించిన స్పందన రాలేదు. కానీ హరీశ్ రావు మాత్రం దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో సఫలమయ్యారు. ఈ సమావేశాన్ని తన రాజకీయ బలప్రదర్శనకు చక్కని వేదికగా ఉపయోగించుకున్నారు.
ఇవి కూడా చదవండి
త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సిద్ధిపేటకు వస్తారని, తనపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తారని హరీశ్ రావు ఈ సభలో ముందుగానే శ్రేణులకు వివరించారు. తనపై వచ్చే తుక్కు తుక్కు ఆరోపణలను నమ్మవద్దని ఆయన తన అభిమానులను, పార్టీ శ్రేణులను కోరారు. రేవంత్ రెడ్డి టార్గెట్ తనపైనే ఉంటుందని ముందే గ్రహించిన హరీశ్ రావు, కేడర్‌ను మానసికంగా సిద్ధం చేసే ప్రయత్నం చేశారు.
కేవలం విమర్శలను తిప్పకొట్టడమే కాకుండా, అధికార పార్టీపై ఎదురుదాడికి కూడా హరీశ్ రావు ప్లాన్ చేశారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పటివరకు సిద్ధిపేటకు రెండు సార్లు వచ్చినా, ఇక్కడ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రేపు మరోసారి సీఎం వస్తే ఈ హామీల అమలుపై గట్టిగా నిలదీయాలని తన పార్టీ శ్రేణులకు, ప్రజలకు హరీశ్ రావు పిలుపునిచ్చారు.
మొత్తానికి, సీఎం రేవంత్ రెడ్డి రాకముందే సిద్ధిపేట వేదికగా హరీశ్ రావు రాజకీయ పావులు కదపడం, తనపై జరిగే దాడిని తిప్పకొట్టేందుకు ముందస్తు వ్యూహాలు రచించడం ఆసక్తికరంగా మారింది. సిరిసిల్లలో ఎదురైన పరిణామాల నుంచి గుణపాఠం నేర్చుకున్న బీఆర్ఎస్ నేతలు, సిద్ధిపేటలో ఎలాంటి వ్యూహాత్మక తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో సిద్ధిపేట వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.








