అన్నమయ్యపురంలో సౌల్ఫుల్ వారి సుమధుర గానపరిమళం
శనివారం నిర్వహిస్తున్న అన్నదానం – అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం సౌల్ఫుల్ కర్ణాటక సంగీత అకాడమీ ఆధ్వర్యంలో గురువు శ్రీమతి కృష్ణప్రియ గారి మార్గదర్శకత్వంలో అన్నమ స్వరార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతితో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.
అనంతరం సాయంత్రం 6 గంటలకు సౌల్ఫుల్ కర్ణాటక సంగీత అకాడమీ శిష్యులు “అక్షర, త్రిషిక, విహాన అనన్య, అదితి, నైనిక, నైతిక్, మానస, దీపికా సాత్విక, సుష్మ, పద్మ, గమ్య, భార్గవి, రమ్య, వినిత, శశి, గాయత్రి, నాగలక్ష్మి, సుజాత, ఉమాదేవి, భాను ప్రియ, అపర్ణ, కే. లక్ష్మి” సంయుక్తంగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి భక్తిపూర్వక స్వరార్చన సమర్పించారు. ఈ సందర్భంగా “అదివో అల్లదివో, ముద్దుగారే యశోద, హరి అవతారమితడు, తిరు తిరు జవరాల, కొండలలో నెలకొన్న, సిరుత నవ్వుల, ఆంజనేయ గుణధామ, నవ నరసింహ, చాలదా హరినామ, రంగ రంగ రంగపతి, ఆడరో పాడరో, శరణు శరణు నీకు, తిరుమల గిరిరాయ, వేదంబెవ్వని” వంటి అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. కాగా ఈ స్వరార్చనకు శాస్త్రి కీబోర్డుపై, స్వరూప్ తబలాపై వాయిద్య సహకారం అందించి గానానికి మరింత శోభను చేకూర్చారు.
శిష్యుల సమిష్టి గానం శ్రుతి–లయ సమన్వయంతో సాగి, అన్నమయ్య సంకీర్తనలలోని భక్తిభావాన్ని, సంగీత మాధుర్యాన్ని చక్కగా ఆవిష్కరించింది.
తదనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు పాల్గొన్న గురువులు, కళాకారులను శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపికలతో సత్కరించారు.
కార్యక్రమం ముగింపులో భాగంగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేసి స్వరార్చన కార్యక్రమం ఆద్యంతం భక్తి, సంగీత మాధుర్యాలతో విజయవంతంగా ముగిసింది.








