కాలిఫోర్నియాలో తనిష్క్ 11వ యూఎస్ స్టోర్ ప్రారంభం.. భారతీయ ఆభరణాల వైభవంతో సందడి
భారత్‌కి చెందిన ప్రముఖ టాటా గ్రూప్ ఆభరణాల బ్రాండ్ తనిష్క్ అమెరికాలో తన విస్తరణను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా దక్షిణ కాలిఫోర్నియాలోని ఆర్టీసియా నగరంలో తన 11వ యూఎస్ స్టోర్‌ను ప్రారంభించింది. పయనీర్ బౌలేవార్డ్‌లో ఏర్పాటు చేసిన ఈ 4,700 చదరపు అడుగుల భారీ షోరూమ్‌లో సాంప్రదాయ బంగారు ఆభరణాలు, వజ్రాలు, రత్నాల కలెక్షన్లతో పాటు వివాహాలు, పండుగలు , నిత్యం ధరించే సమకాలీన డిజైన్లతో కూడిన 5,500 కంటే ఎక్కువ రకాల డిజైన్లను అందుబాటులో ఉంచారు.
అట్టహాసంగా ప్రారంభోత్సవం…
ఈ షోరూమ్ ప్రారంభోత్సవ వేడుకలను రిబ్బన్ కటింగ్, సాంప్రదాయ జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాషన్ షో, లైవ్ మ్యూజిక్ , విందు ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకకు లాస్ ఏంజెల్స్‌లోని భారత కాన్సుల్ జనరల్ అంబాసిడర్ డాక్టర్ కె.జె. శ్రీనివాస, కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ట్రాన్, ఆర్టీసియా మేయర్ రెనే ట్రెవినో , తనిష్క్ సీఈఓ అరుణ్ నారాయణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
విస్తరిస్తున్న తనిష్క్ నెట్వర్క్
టైటాన్ కంపెనీ లిమిటెడ్ నార్త్ అమెరికా బిజినెస్ హెడ్ అమృత్ పాల్ సింగ్ మాట్లాడుతూ, లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో స్టోర్ ప్రారంభించడం అమెరికా వ్యాప్తంగా తమ విస్తరణలో ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. దక్షిణ కాలిఫోర్నియా ఎంతో చైతన్యవంతమైన మార్కెట్ అని, ఇక్కడి వినియోగదారులకు భారతీయ బంగారు కళా నైపుణ్యం, ఆధునిక డిజైన్లను అందించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
తాజా ఆర్టీసియా స్టోర్‌తో కలిపి అమెరికాలో తనిష్క్ షోరూమ్‌ల సంఖ్య 11కి చేరింది. ఇంతకుముందు న్యూజెర్సీ, చికాగో, డల్లాస్, హ్యూస్టన్, రెడ్మండ్, అట్లాంటా, శాంటా క్లారా, వర్జీనియా, ఓర్లాండో , బోస్టన్ నగరాల్లో తనిష్క్ స్టోర్లను ఏర్పాటు చేసింది. వివాహాలు, సాంస్కృతిక పండుగలకు భారతీయ ఆభరణాలకు అధిక డిమాండ్ ఉన్న ప్రవాస దక్షిణాసియా కమ్యూనిటీలను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణను చేపట్టినట్లు సంస్థ స్పష్టం చేసింది.








