బెజవాడ వేదికగా చంద్రబాబు, పవన్ లతో విజయ్ భేటీ..!
దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక కీలక పరిణామం ఈ నెల 13న విజయవాడ వేదికగా చోటుచేసుకోబోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్(CM Vijay) వచ్చే మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో(Chandrababu Naidu) పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తమిళనాడులో నూతనంగా అధికారంలోకి వచ్చిన సీఎం విజయ్ ఏపీ అగ్రనేతలతో భేటీ కానుండటం ఇరు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
ఈ ఉన్నత స్థాయి సమావేశం వెనుక ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న దీర్ఘకాలిక తెలుగు గంగ ప్రాజెక్టు ఒప్పందం, నీటి సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ఉందని తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం తమిళనాడుకు అందాల్సిన కృష్ణా జలాల వాటా సక్రమంగా అందడం లేదని తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం ఏపీ నుండి రావాల్సిన మిగిలిన నీటిని వెంటనే విడుదల చేయాలని సీఎం విజయ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరనున్నారు. దీనితో పాటు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నదుల అనుసంధానం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో విజయ్ చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఈ పర్యటనకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా ఉంది. విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలలో సీఎం విజయ్ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని కూడా దర్శించుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన వెంటనే విజయ్ ఇప్పుడు ఏపీ వైపు అడుగులు వేస్తుండటంతో దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రాంతీయ బంధాన్ని బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఒక గట్టి పునాదిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.








