హైస్పీడ్ రైలు భూసేకరణపై వివాదం.. కేంద్రం కీలక ప్రకటన
హైదరాబాద్ కేంద్రంగా మూడు కీలక నగరాలను కలుపుతూ ప్రతిపాదించిన హైస్పీడ్ రైల్ కారిడార్ల ప్రాజెక్టు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అభివృద్ధి నినాదంతో సాగుతున్న ఈ మెగా ప్రాజెక్టులు ఒకవైపు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తాయని ఆశలు రేకెత్తిస్తుంటే, మరోవైపు భూసేకరణ అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన ఈ వివాదంలో సరికొత్త రాజకీయ మలుపు తిప్పింది.
ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి భేటీ ఈ ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని బట్టబయలు చేసింది. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె కారిడార్లకు సంబంధించి ప్రస్తుతం కేవలం ప్రాథమిక అలైన్మెంట్ అధ్యయనాలు మాత్రమే జరుగుతున్నాయని స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వాలకు భూసేకరణకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు పంపలేదని తేల్చి చెప్పింది. ఈ దశలో జరిగే భూసేకరణ చట్టవిరుద్ధమని కేంద్రం ప్రకటించడం గమనార్హం.
అయితే.. కేంద్రం ఈ స్పష్టత ఇవ్వడానికి బలమైన రాజకీయ నేపథ్యమే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే శివారు ప్రాంతాల్లో రైల్ కారిడార్లు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా.. రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్రబిందువుగా మారిన శివారు ప్రాంతాల్లో భూములు కోల్పోతున్న రైతుల నుంచి తీవ్ర వ్యతిరేక్త వ్యక్తమవుతోంది. అలైన్మెంట్ ఖరారు కాకముందే, రైతుల నుంచి సమ్మతి తీసుకోకుండా హడావుడిగా భూసేకరణ చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన రైతులకు ఒకరకంగా భరోసా ఇస్తూనే, రాష్ట్ర ప్రభుత్వంపై పరోక్ష రాజకీయ అస్త్రంగా మారింది.
అలైన్మెంట్ ప్రక్రియ పూర్తి కాకుండానే భూసేకరణ పేరిట జరుగుతున్న పరిణామాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టుల అలైన్మెంట్ ఖరారైతే, భూసేకరణ వివాదం మరింత ముదిరే అవకాశముంది. అభివృద్ధి ముసుగులో రైతుల హక్కులను హరించాలని చూస్తే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే సంకేతాలు ఈ పరిణామాల ద్వారా స్పష్టమవుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, పారదర్శకంగా వ్యవహరించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.








