BJP: బీజేపీ నుంచి ఎమ్మెల్సీ బరిలో ఉపాధ్యాయ సంఘం నేత?
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల స్థానం చుట్టూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు భిక్షం గౌడ్ బరిలోకి దిగనున్నారనే ప్రచారం జోరందుకుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీఆర్టీయూ నేతలు, ఎమ్మెల్సీ అల్లుగుంట శ్రీపాల్ రెడ్డి బీజేపీ పెద్దలను కలిసి ఈ మేరకు చర్చలు జరిపారు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయబోతున్న పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జూరి భిక్షం గౌడ్‌కు బీజేపీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరారు. భిక్షం గౌడ్‌కు సీటు కేటాయిస్తే ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్ధులను త్వరలోనే అధిష్ఠానం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
బీజేపీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది ఔత్సాహికులు పోటీ పడుతున్నారు. అయితే అనూహ్యంగా పీఆర్టీయూ నేతలు తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ కార్యకర్తలు కాకుండా ఉపాధ్యాయ యూనియన్ కు చెందిన నేతకు బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం కల్పించడం ద్వారా పెద్ద స్కెచ్చే వేసినట్లు అర్థమవుతోంది. పీఆర్టీయూకు ఉపాధ్యాయ వర్గాల్లో మంచి పట్టుంది. అలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా తమకు ఎన్నికల్లో కలిసొస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది.
భిక్షం గౌడ్‌కు అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయమైందనే ప్రచారం బీజేపీలో జరుగుతోంది. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో ఆయనకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు, సంఘంతో ఉన్న బలమైన నెట్వర్క్ పార్టీ విజయానికి ఉపయోగపడతాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యూహం ద్వారా రాబోయే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ సానుకూల ఫలితాలు సాధించవచ్చనే యోచనలో కమలనాథులు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి భిక్షం గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్టేనని బీజేపీ వర్గాల ద్వారా ప్రచారం జరుగుతోంది. మరో స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అయితే.. ఈ పరిణామాలు బీజేపీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలకు దారితీస్తున్నాయి. ఏళ్ల తరబడి పార్టీ నమ్ముకుని కష్టపడిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు లేదా సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలని కొందరు బీజేపీ సీనియర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. బయట నుంచి వచ్చే వారికి ప్రాధాన్యత ఇస్తే మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి నిరాశ ఎదురవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో… భిక్షం గౌడ్ ఎంట్రీ ఖరారవుతుందా? లేక పార్టీ సీనియర్ల డిమాండ్ మేరకు పార్టీ వారికే ఛాన్స్ దక్కుతుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.








