పల్నాడు జిల్లా కూటమిలో రేగిన రెబల్ మంట..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పీక్స్‌కు చేరిన వేళ.. పల్నాడు జిల్లా కూటమి రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వినుకొండ(Vinukonda) పురపాలక సంఘం చైర్మన్ అభ్యర్థి ఎంపిక కూటమిలో తీవ్ర అసమ్మతికి దారితీసింది. ఇక్కడ కూటమి తరఫున అధికారిక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన షమీమ్ ఖాన్ అభ్యర్థిత్వంపై స్థానిక క్యాడర్ మరియు నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా పార్టీకి అండగా ఉంటున్న తమ సామాజిక వర్గానికి ఈసారి చైర్మన్ పీఠం కేటాయించాలని ఆర్యవైశ్య సంఘం గట్టిగా పట్టుబట్టడంతో వినుకొండ కూటమిలో విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి.
ఈ టికెట్ వివాదంపై అసమ్మతి నేతలు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పల్నాడు జిల్లాకు చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వినుకొండలో ఆర్యవైశ్యులకు ఉన్న ప్రాధాన్యతను, చైర్మన్ సీటు తమకే ఎందుకు కేటాయించాలో వారు ఈ సమావేశంలో సుదీర్ఘంగా వివరించారు. అయితే, చీఫ్ విప్ ఆంజనేయులతో జరిపిన ఈ రాయబార చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని ఆయన కోరినప్పటికీ, ఆర్యవైశ్య సంఘం నేతలు అందుకు అంగీకరించలేదు.
చర్చలు ఫలించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆర్యవైశ్య అభ్యర్థులు కూటమి అధికారిక నిర్ణయానికి వ్యతిరేకంగా స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేసి తిరుగుబాటు జెండా ఎగరేశారు. వినుకొండలో కూటమికి రెబల్స్ బెడద తీవ్రం కావడంతో, ఈ సంక్షోభాన్ని నివారించడానికి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు లోపు రెబల్స్ అందరినీ బుజ్జగించి, కూటమి అభ్యర్థి విజయానికి సహకరించేలా చేయడానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆర్యవైశ్య సంఘం కీలక నేతలతో మాట్లాడుతుండటంతో పాటు, భవిష్యత్తులో వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తూ శాంతింపజేసే పనిలో పడ్డారు. మరి మంత్రిగారి బుజ్జగింపుల పర్వం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో, వినుకొండలో కూటమి రెబల్స్ వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి.








