రోడ్డు ధ్వంసంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ వారోత్సవాల అభివృద్ధి పనులకు కొందరు దుండగులు ఆటంకం కలిగించడం తీవ్ర కలకలం రేపింది. తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం మరియు పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య సుమారు రూ.4.75 కోట్ల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించిన రహదారిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్‌తో దున్నేసి ధ్వంసం చేశారు.
దాదాపు 100 మీటర్ల మేర ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ రోడ్డును ఇష్టానుసారంగా పాడుచేసిన ఈ ఉదంతంపై ఉన్నతాధికారుల నుండి నివేదికలు అందుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చడానికి, ప్రజల రవాణా సౌకర్యార్థం ప్రభుత్వం ఎంతో శ్రమించి నిర్మించిన రహదారులను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తూ, ప్రజా ప్రగతిని అడ్డుకోవాలని చూసే వికృత చేష్టలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. గ్రామాల్లో కాలికి బురద అంటకుండా ప్రజలు తిరగాలనే సంకల్పంతో నాణ్యతా ప్రమాణాలతో సిమెంట్, బీటీ రోడ్లను వేస్తుంటే, ఇలాంటి అరాచకాలకు పాల్పడటం తీవ్రమైన నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు, పోలీసు శాఖకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డును కావాలనే ట్రాక్టర్లతో దున్నిన నిందితులను వెంటనే గుర్తించి, వారిపై తక్షణమే ‘నాన్ బెయిలబుల్’ (Non-Bailable) సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, రహదారి ధ్వంసం కావడం వల్ల ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టాన్ని పూర్తిగా నిందితుల నుంచే రికవరీ చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ‘రెవెన్యూ రికవరీ యాక్ట్’ (Revenue Recovery Act) కింద బాధ్యుల ఆస్తుల నుండి ఆ నష్టపరిహార మొత్తాన్ని వసూలు చేయాలని అధికారులకు పవన్ కల్యాణ్ కీలక దిశానిర్దేశం చేశారు.








