నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్పై వేటు..!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ బాధ్యతల నుండి ప్రస్తుత ఇన్ఛార్జ్ రాజాన సూర్యచంద్రను తక్షణమే తప్పిస్తూ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కూటమి పార్టీల మధ్య సమన్వయం విషయంలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన అనంతరం అధిష్టానం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయ వ్యవహారాలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి స్థానిక నేతలు, క్యాడర్ నుండి వరుసగా అందిన పలు ఫిర్యాదుల నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. రాజాన సూర్యచంద్రను బాధ్యతల నుండి ఉద్వాసన పలికిన జనసేన అధిష్టానం.. నర్సీపట్నం నియోజకవర్గ నూతన సమన్వయ బాధ్యతలను పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు అప్పగించింది. అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, అలాగే పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబులకు నర్సీపట్నం అదనపు బాధ్యతలను కట్టబెట్టింది.
ఉత్తరాంధ్రా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఇకపై నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ వ్యవహారాలను, కూటమి పార్టీలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో సమన్వయ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను ఏకతాటిపైకి తెస్తూ, స్థానిక కూటమి నాయకులతో సత్సంబంధాలు కొనసాగించేలా పవన్ కల్యాణ్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ మార్పులు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబులకు అప్పగించిన ఈ కొత్త సమన్వయ బాధ్యతలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. ఈ ఆకస్మిక మార్పుతో నర్సీపట్నం నియోజకవర్గ జనసేన రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కగా.. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక క్యాడర్ భిన్న రకాలుగా స్పందిస్తోంది.








