‘వెటా’ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి!
అమెరికాలోని సాన్ రామన్లోని విండిమియ్యార్ రాంచ్ మిడిల్ స్కూల్లో వెటా (WETA – Women Empowerment of Telugu Association) ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వెటా ఫౌండర్ & చైర్మన్ శ్రీమతి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ప్రవాస తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం నుంచి కోదాడ శాసనసభ్యురాలు శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. విదేశీ గడ్డపై కూడా తెలుగు సంస్కృతిని సజీవంగా ఉంచుతూ, భావితరాలకు అందించేలా ప్రవాసులు ఇలాంటి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. రంగురంగుల పూల బతుకమ్మలు, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది.









