పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ విషయమై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఇంట్లో పిల్లలు ఫోన్ పట్టుకుంటే చాలు.. తల్లిదండ్రులకు టెన్షన్ మొదలవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చూస్తున్నారు? సోషల్ మీడియాలో ఎవరైనా పరిచయమయ్యారా? ఇలా ఎన్నో సందేహాలు. పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడాలంటే ఫోన్‌కు దూరంగా ఉంచడమే మంచిదని చాలామంది అనుకుంటారు. కానీ, అసలు సమస్యకు అదే పరిష్కారమా? పిల్లల చేతిలో ఫోన్ లేకపోతే ఆన్లైన్ ప్రమాదాలు పూర్తిగా ఆగిపోతాయా? ఈ ప్రశ్నల మధ్య ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అసలేం జరిగింది
మన దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం విధించాలనే ఆలోచనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించే అంశం చర్చకు వచ్చింది. మరోవైపు, 18 ఏళ్లలోపు పిల్లల ఇంటర్నెట్ వినియోగాన్ని నియంత్రించే ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. ఇలాంటి సమయంలో పిల్లలను ఇంటర్నెట్కు పూర్తిగా దూరం చేయడం సరైన మార్గం కాదనే అంశాన్ని సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చింది. పిల్లల భద్రతతో పాటు వారి హక్కులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
పిల్లల భద్రత పేరుతో ఇంటర్నెట్నే ఆపేస్తే ఎలా?
పిల్లలు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారో తెలుసుకోవడం తల్లిదండ్రులకు కష్టంగా మారుతోంది. ఒకవైపు చదువుకు ఉపయోగపడే సమాచారం, కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు ఉంటే.. మరోవైపు అసభ్యకరమైన కంటెంట్, సైబర్ వేధింపులు, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు కూడా ఉంటున్నాయి. అందుకే పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్లు లేకుండా చేస్తే సమస్య మొత్తం పరిష్కారమవుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ, సుప్రీంకోర్టు పరిశీలించిన అంశం ఇక్కడే ఆసక్తికరంగా మారింది. ఇంటర్నెట్పై పూర్తిగా ఆంక్షలు విధిస్తే పిల్లలు సురక్షితంగా ఉంటారని చెప్పలేమని, కొన్నిసార్లు అలాంటి చర్యలే వారిని మరింత ప్రమాదకరమైన వెబ్సైట్ల వైపు నెట్టే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
ఇంకో విషయం కూడా ఉంది. ఇంటర్నెట్లో ఒక పిల్లవాడికి ఎవరైనా వేధింపులకు పాల్పడ్డారనుకుందాం. ఆ విషయం తల్లిదండ్రులకు చెబితే ఫోన్ తీసేసుకుంటారేమో, ఇంటర్నెట్ వాడనివ్వరేమో అనే భయం ఉంటే ఆ పిల్లవాడు తనకు ఎదురైన సమస్యను దాచిపెట్టే అవకాశం ఉంది. అప్పుడు అసలు నేరం చేసిన వ్యక్తి తప్పించుకునే ప్రమాదం ఉంటుంది. పిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో పెట్టిన నిబంధనలే, వారు సహాయం కోరడానికి అడ్డంకిగా మారకూడదన్నది ఈ చర్చలో అత్యంత కీలకమైన అంశం.
సోషల్ మీడియా బ్యాన్ కంటే ప్రమాదకరమైన కంటెంట్‌పై చర్యలు ముఖ్యమా?
పిల్లలు ఇంటర్నెట్ వాడుతున్నారా లేదా అన్నదానికంటే, ఇంటర్నెట్లో పిల్లలకు ఎదురవుతున్న ప్రమాదాలను ఎంత సమర్థంగా అడ్డుకుంటున్నామన్నదే అసలైన విషయంగా కోర్టు చెప్పింది. బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆన్లైన్లో వ్యాప్తి చెందుతున్నా వాటిని పూర్తిగా అరికట్టలేకపోతున్నారనే అంశంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఒక సోషల్ మీడియా సంస్థ ఇలాంటి కంటెంట్‌ను గుర్తించి తొలగించినా, అదే వీడియో మరో ప్లాట్ఫామ్లో మళ్లీ కనిపిస్తే పరిస్థితి మొదటికొస్తుంది. ప్రతిచోటా మళ్లీ ఫిర్యాదు చేయాల్సి వస్తే, బాధితులను రక్షించే ప్రక్రియ ఆలస్యమవుతుంది.
అందుకే ఈ సమస్యను కేవలం పిల్లల ఫోన్ వినియోగానికి పరిమితం చేయకుండా, అక్రమ కంటెంట్‌ను సృష్టించే వ్యక్తులు, దాన్ని ప్రచారం చేసే నెట్‌వర్క్‌లు, వాటిని అడ్డుకోవడంలో విఫలమవుతున్న వ్యవస్థలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చేయడం ఒక చర్య మాత్రమే కావచ్చు. కానీ వారిని లక్ష్యంగా చేసుకునే వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే అసలు సమస్య అలాగే మిగిలిపోతుంది.
అక్రమ వీడియోలను గుర్తించేందుకు జాతీయ డేటాబేస్లు!
ఇంటర్నెట్లో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను వేగంగా గుర్తించి తొలగించేందుకు జాతీయ స్థాయిలో డేటాబేస్‌ల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటికే గుర్తించిన అక్రమ ఫొటోలు, వీడియోలకు సంబంధించిన డిజిటల్ గుర్తింపులు, వాటి వెబ్ లింకుల ఆధారంగా వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న కాపీలను గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని ఉద్దేశం.
అయితే, ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. ఎవరైనా ఫిర్యాదు చేశారనే కారణంతోనే ఒక కంటెంట్‌ను తొలగించేస్తే, తప్పుగా గుర్తించిన సందర్భాల్లో అమాయకుల కంటెంట్ కూడా దెబ్బతినవచ్చు. అందుకే తగిన పరిశీలన లేకుండా కంటెంట్‌ను తొలగించకూడదని, పొరపాటున కంటెంట్ తొలగించబడినవారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉండాలని కోర్టు సూచించింది. అంటే పిల్లలను రక్షించేందుకు రూపొందించే వ్యవస్థలు పనిచేయాలి.. అదే సమయంలో వాటిని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా జాగ్రత్తలు కూడా ఉండాలి.
గూగుల్, మెటా కూడా బాధ్యత తీసుకోవాల్సిందే!
ఈ వ్యవహారంలో టెక్నాలజీ సంస్థల పాత్ర కూడా కీలకమే. బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను భారతీయ చట్ట అమలు సంస్థలకు నేరుగా నివేదించే విధానాన్ని అనుసరించాలని కేంద్రం టెక్నాలజీ కంపెనీలను కోరింది.
సుప్రీంకోర్టు తీర్పు వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటి?
ఈ వ్యవహారంలో ముఖ్యమైన విషయం ఒక్కటే.. పిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో వారి ఇంటర్నెట్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయడం కంటే, ప్రమాదాలను అడ్డుకునే విధానాలను బలోపేతం చేయడం అవసరం. అయితే, సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పిల్లలకు ఎలాంటి పరిమితులూ ఉండకూడదనే అర్థంలో తీసుకోకూడదు.
పిల్లలకు ఏది ప్రమాదకరమో అర్థమయ్యేలా చెప్పడం, సమస్య వచ్చినప్పుడు భయపడకుండా సహాయం కోరే వాతావరణం కల్పించడం చాలా అవసరం. తల్లిదండ్రులు కూడా పిల్లల ఫోన్‌ను ఎప్పుడూ తనిఖీ చేయడం లేదా అకస్మాత్తుగా ఫోన్ లాక్కోవడం దగ్గరే ఆగిపోకుండా, ఆన్లైన్లో ఏం జరుగుతోంది, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనే విషయాలను వారితో చర్చించగలగాలి.
వయసుకు తగిన నియంత్రణలు, తల్లిదండ్రుల పర్యవేక్షణ, ప్రమాదకరమైన కంటెంట్‌పై చర్యలు, పిల్లలకు డిజిటల్ అవగాహన.. ఇవన్నీ కలిసే పనిచేయాలి.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








