కేసీఆర్పై నిరాధార ఆరోపణలు.. ‘వెలుగు’ కథనాన్ని ఖండించిన మహేష్ బిగాల!
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘వెలుగు’ దినపత్రికలో కథనం ప్రచురితమైందని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ‘కేసీఆర్ ఫామ్హౌస్కు మళ్లిన కొండపోచమ్మ’ కథనంపై ఆయన స్పందించారు. సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని కేసీఆర్ వ్యక్తిగత వ్యవసాయ క్షేత్రంతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నప్పుడు అధికారిక ఆధారాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత పత్రికలపై ఉందని స్పష్టం చేశారు.
ఆధారాలు చూపకుండా సంచలనాత్మక శీర్షికలతో ప్రజల్లో అపోహలు సృష్టించడం సమర్థనీయం కాదన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ డిమాండ్ చేసినట్లుగా, వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకొని 24 గంటల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆ క్షమాపణను మొదటి పేజీతో పాటు డిజిటల్ మాధ్యమాల్లోనూ ప్రముఖంగా ప్రచురించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలు, ప్రాజెక్టులపై ఆధారాలతో చర్చకు తాము ఎప్పుడూ సిద్ధమేనని, కేసీఆర్పై నిరాధార ప్రచారాన్ని మాత్రం సహించేది లేదని మహేష్ బిగాల హెచ్చరించారు.








