200 ఏళ్ల నాటి హిందూ ఆలయాన్ని కూల్చేయాలనుకున్నారా? పాకిస్థాన్‌లో ఏం జరిగింది?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ హిందూ ఆలయం.. ఆ స్థలంలో కమర్షియల్ ప్లాజా నిర్మించాలనే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు! పాకిస్థాన్‌లోని రామ్‌లీలా మందిరం చుట్టూ ఇప్పుడు ఇదే వివాదం నడుస్తోంది.
ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారనే వార్త బయటకు రావడంతో స్థానిక హిందూ సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారి నిరసనలతో అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ వివాదం కేవలం ఓ ఆలయానికి సంబంధించినది మాత్రమే కాదు.. మైనారిటీల మతపరమైన ఆస్తులకు రక్షణ ఎంతవరకు ఉందనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది.
కమర్షియల్ ప్లాజా కోసమేనా ఈ ప్రయత్నం?
పాకిస్థాన్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలోని రహీమ్ బజార్ ప్రాంతంలో రామ్‌లీలా మందిరం ఉంది. ఈ ఆలయాన్ని కూల్చివేస్తున్నారనే సమాచారం అందడంతో డేరా సివిల్ సొసైటీ అధ్యక్షుడు, స్థానిక వ్యాపార సంఘం నాయకుడు సొహైల్ అహ్మద్ అజ్మీ ఇతరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆలయంలో జరుగుతున్న పనులను అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు.
ఆలయాన్ని కూల్చి, ఆ స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఆలయ భూమి యాజమాన్యం ఎవరికి ఉంది, అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా అనే విషయాలు ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది.
వైరల్ వీడియోతో వెలుగులోకి వచ్చిన ఘటన
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయంలోని కొన్ని భాగాలు దెబ్బతిన్నట్లు అందులో కనిపిస్తోంది. ఈ వీడియో బయటకు రావడంతో స్థానికంగా ఆందోళన పెరిగింది. హిందూ సంఘాల సభ్యులు, సామాజిక కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు జోక్యం చేసుకున్నారు.
శనివారం స్థానిక అధికారులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ETPB) ఆలయానికి సీల్ వేసింది. అయితే, కూల్చివేత పనులు ఎవరు చేపట్టారు, వాటికి అనుమతులు ఉన్నాయా, ఆలయ స్థలంలో వాణిజ్య నిర్మాణం చేపట్టేందుకు ఎవరైనా ప్రయత్నించారా అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
ఆలయ భూమి యాజమాన్యంపై విచారణకు డిమాండ్
ఈ ఘటనపై హిందూ సంఘాల సభ్యులు సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు. ఆలయ భూమి ఎవరి ఆధీనంలో ఉంది, దానిపై చట్టబద్ధమైన హక్కులు ఎవరికి ఉన్నాయి, వాణిజ్య నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారా అనే అంశాలను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో కూడా ప్రస్తావించాలని ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో సుమారు 400 భవనాలను సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలుగా గుర్తించారు. భారత్-పాకిస్థాన్ విభజన సమయంలో భారత్‌కు వలస వెళ్లిన ప్రజలు వదిలివెళ్లిన ఆస్తులతో పాటు, మైనారిటీ వర్గాలకు చెందిన కొన్ని మతపరమైన ప్రదేశాల నిర్వహణ కూడా ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు పరిధిలో ఉంటుంది.
మైనారిటీల మతపరమైన ప్రదేశాలకు భద్రత కల్పించాలంటూ..
ఆల్ పాకిస్థాన్ హిందూ రైట్స్ మూవ్మెంట్ అధ్యక్షుడు హరూన్ సర్బ్ దయాల్ మతపరమైన ప్రదేశాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరారు. 2013 నుంచి 2026 మధ్య మతపరమైన ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, విక్రయించడం వంటి ఆరోపణలపై కూడా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
పాకిస్థాన్ మానవ హక్కుల సంఘం కూడా మతపరమైన మైనారిటీల హక్కులపై ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ, క్రైస్తవ బాలికల అపహరణ, బలవంతపు వివాహాలు, మతమార్పిడులకు సంబంధించిన కేసుల్లో వివక్షపూరిత వైఖరి కనిపిస్తోందని తన తాజా నివేదికలో పేర్కొంది. మతపరమైన ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పెంచాలని, వాటి బాధ్యతలు నిర్వర్తించే సంస్థలు జవాబుదారీగా వ్యవహరించాలని కూడా సిఫార్సు చేసింది.
200 ఏళ్ల చరిత్రను కాపాడతారా?
రామ్‌లీలా మందిరం చుట్టూ మొదలైన వివాదానికి ఇంకా పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదు. ఆలయ భూమి యాజమాన్యం, కూల్చివేతకు సంబంధించిన అనుమతులు, వాణిజ్య నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశాలపై అధికారిక విచారణ జరగాల్సి ఉంది.
ఒక ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం కొత్త భవనాలు నిర్మించుకోవచ్చు. వ్యాపార సముదాయాలూ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అదే సమయంలో అక్కడి చారిత్రక, మతపరమైన వారసత్వాన్ని కాపాడటం కూడా ముఖ్యమే. దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం భవిష్యత్తు ఏమిటన్నది ఇప్పుడు కీలకంగా మారింది.








