సోషల్ మీడియాను శాసిస్తున్నదెవరు? మస్క్ చుట్టూ కొత్త వివాదం!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
సోషల్ మీడియా మన చేతిలో ఉంటే.. మనకు నచ్చిన విషయాన్ని ప్రపంచమంతా చూసేలా చేయొచ్చా? మనకు నచ్చని విషయాన్ని కోట్లాది మందికి తెలియకుండా ఆపేయొచ్చా? అసలు ప్రపంచానికి ఏం తెలియాలి, ఏం తెలియకూడదు అనే నిర్ణయాన్ని కొన్ని టెక్ కంపెనీలు తీసుకుంటే.. అది భావప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం కాదా? ఇప్పుడు ఎలాన్ మస్క్‌పై రూపొందించిన ఓ డాక్యుమెంటరీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి.
అసలేం జరిగింది?
ఎలాన్ మస్క్‌పై తీసిన ఓ డాక్యుమెంటరీ విడుదలవుతున్న కీలక సమయంలో, దానికి సంబంధించిన టిక్‌టాక్ ప్రమోషన్ ఖాతా అకస్మాత్తుగా శాశ్వతంగా నిలిచిపోవడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఒక డాక్యుమెంటరీ ప్రచారాన్ని అడ్డుకోవడానికి సోషల్ మీడియా వేదికలపై ఏమైనా తెరవెనుక వ్యూహాలు నడిచాయా, లేదా మస్క్ తనకున్న ప్రాభవాన్ని ఉపయోగించి టిక్‌టాక్‌ను మేనేజ్ చేశారా అనే కోణంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ప్రీమియర్ షోలు జరుగుతున్న టైమ్‌లోనే ఖాతాను క్లోజ్ చేయటం, వివాదం అయ్యాక ‘అయ్యో సాంకేతిక పొరపాటు’ అంటూ టిక్‌టాక్ మళ్లీ పునరుద్ధరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్న అంశం ఏంటంటే… ట్రైలర్ ప్రమోషన్ల విషయంలో ఒక్క టిక్‌టాక్ మాత్రమే కాదు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మెటా, చివరికి మస్క్ సొంత సంస్థ ‘ఎక్స్’ కూడా రకరకాల వంకలతో ప్రచార ప్రకటనలను తిరస్కరించడమే. రాజకీయ కంటెంట్ అంటూ కొన్ని వేదికలు, బాట్ సిస్టమ్ పొరపాటంటూ మరికొన్ని వేదికలు ప్రమోషన్లను అడ్డుకునే ప్రయత్నం చేశాయి.
అలెక్స్ గిబ్నీ లాంటి దిగ్గజ దర్శకుడు మస్క్ వ్యాపార పద్ధతులను, ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను విమర్శనాత్మకంగా ఎండగడుతూ తెరకెక్కించిన చిత్రం కావడంతోనే, ఈ సినిమా జనం దృష్టిలో పడకుండా ఉండేందుకు మస్క్ తనకున్న నెట్‌వర్క్‌ను వాడి ప్లాట్‌ఫామ్‌లపై ఒత్తిడి తెచ్చారా అనే కోణంలో విశ్లేషణలు వస్తున్నాయి.
స్నేహితుడు అండతోనే…
టిక్‌టాక్‌లో మస్క్‌కు నేరుగా వాటాలు లేకపోయినప్పటికీ, ఆయన అత్యంత ఆప్తమిత్రుడు, బిలియనీర్ లారీ ఎలిసన్‌కు టిక్‌టాక్ భాగస్వామ్య యాజమాన్యంతో గట్టి అనుబంధం ఉంది. ఎలిసన్ గతంలో మస్క్ సంస్థలైన టెస్లా, ఎక్స్లలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు. మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి, ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న డాక్యుమెంటరీని తొక్కేయడానికి ఈ నెట్వర్క్ పనిచేసిందా అనే సందేహాలను సినిమా నిర్మాతలు కూడా పరోక్షంగా లేవనెత్తుతున్నారు.
సినిమా నిర్మాత నిక్ షూమేకర్ ఈ వ్యవహారంపై మండిపడుతూ, తమది ఏ రకమైన రాజకీయ ప్రకటన కాకపోయినా ప్రచారాన్ని అడ్డుకోవడం వెనుక పెద్ద ఎత్తున భావప్రకటనా స్వేచ్ఛను అణచివేసే కుట్ర ఉందనే సంకేతాలు ఇచ్చారు.
చివరికి వివాదం చెలరేగడంతో టిక్‌టాక్, మెటా, యూట్యూబ్ వంటి సంస్థలు ‘పొరపాటు జరిగింది’ అని సర్దు చెప్పుకుని ప్రమోషన్లకు అనుమతించినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఒక బిలియనీర్ వ్యాపారవేత్తపై వచ్చిన విమర్శనాత్మక కంటెంట్‌ను బయటకు రాకుండా చూడటానికి అల్గోరిథంలను, లోపాయికారీ బంధాలను వాడుకున్నారా అనే కోణంలో ఈ ఘటన ఇప్పుడు టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏదైమైనా…
మస్క్‌పై తీసిన సినిమా ట్రైలర్‌కు సోషల్ మీడియా వేదికల్లో అడ్డంకులు ఎదురవడం, ప్రమోషనల్ టిక్‌టాక్ ఖాతాను సస్పెండ్ చేయడం, ఆ తర్వాత పొరపాటు జరిగిందంటూ మళ్లీ పునరుద్ధరించడం.. ఇవన్నీ చూస్తుంటే ఒక సందేహం కలగకమానదు. సోషల్ మీడియా వేదికలను శాసించే శక్తి ఉన్నవాళ్లు.. ప్రపంచానికి కనిపించాల్సిన సమాచారాన్ని కూడా శాసించగలరా?








