BRS: బలమైన అభ్యర్థులకోసం బీఆర్ఎస్ వేట!
తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఉంది. మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ తో పాటు నల్గొండ- ఖమ్మం- వరంగల్ నియోజకవర్గాల స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది. అన్ని పార్టీలకంటే ఈ విషయంలో ముందుంది. దీంతో బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉంది.
మరోవైపు,, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పార్టీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలను చావోరేవో అన్నట్టు బావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం, అనంతరం జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడం.. బీఆర్ఎస్ ను నిరాశలోకి నెట్టేసింది. అందుకే అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని భావిస్తున్న బీఆర్ఎస్.. దాన్ని క్యాష్ చేసుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తొందరపాటు లేకుండా, అన్ని అంశాలను బేరీజు వేస్తోంది.
పట్టభద్రుల నియోజకవర్గాలు ఐదారు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇన్ని జిల్లాల్లో ప్రచారం చేయాలంటే ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఉండాలని, అలాంటి వాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఎన్నికల ఖర్చులను సమర్థవంతంగా ఎదుర్కొని, సొంత బలంతో విస్తృత ప్రచారం చేయగల నేతలకోసం అన్వేషిస్తోంది. ఇలాంటి ఆశావహులతో ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ ఓ దఫా చర్చలు జరిపినట్లు సమాచారం. అధికారంలో లేని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేవలం పార్టీ కేడర్ మీదే ఆధారపడి గెలుపొందడం అసాధ్యమని బీఆర్ఎస్ అధిష్టానం గ్రహించింది.
అలాగే.. సాంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, సామాజిక వర్గాల సమతుల్యతను దెబ్బతీయకుండా పక్కా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. వ్యక్తిగత ఇమేజ్, మేధోవర్గంతో సులువుగా మమేకమయ్యే నాయకులను బరిలోకి దించితేనే అధికార కాంగ్రెస్ను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చని గులాబీ శ్రేణులు నమ్ముతున్నాయి.
ప్రధాన రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా డిజిటల్ వార్ మాత్రం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిస్తున్నారు. పట్టభద్రులలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమవైపునకు తిప్పుకోవడానికి విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు డిజిటల్ వేదికలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అభ్యర్థుల ఖరారులో జరుగుతున్న కొంత జాప్యం క్షేత్రస్థాయి ఓటర్ల నమోదుపై పాక్షికంగా ప్రభావం చూపినప్పటికీ, సరైన సామాజిక, ఆర్థిక బలాలున్న సమర్థుడైన అభ్యర్థిని రంగంలోకి దించితే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అన్ని సమీకరణాలను బేరీజు వేసుకుంటూ, మరో నాలుగైదు రోజుల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.








