పొత్తులపై పార్టీల దాగుడుమూతలు
తెలంగాణలో రాజకీయ పార్టీల పొత్తుల అంశం ఒక పెద్ద ప్రహసనంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ పైకి మాత్రం ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ, తెరవెనుక మాత్రం ఎత్తులు, పైఎత్తులు, రహస్య ఒప్పందాల రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఏ పార్టీ కూడా తమ మిత్రపక్షాలు ఎవరో, శత్రువులు ఎవరో స్పష్టంగా చెప్పలేని అయోమయ పరిస్థితి నెలకొంది.
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, సామ రామమోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి డాక్టర్ గడల శ్రీనివాస్ రావును తమ అభ్యిర్థిగా ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అయితే.. ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో బంధంపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు దీనిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతూ వస్తున్నారు.
ఇదిలాఉంటే.. వామపక్ష పార్టీల పరిస్థితి మరీ విచిత్రంగా తయారైంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు.. కమ్యూనిస్ట్ పార్టీలు విలీనం కావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం వామపక్షాల మద్దతు కోరుతున్నప్పటికీ, వామపక్షాలు మాత్రం అంతర్గత చర్చల తర్వాతే తమ వైఖరి స్పష్టం చేస్తామంటున్నాయి.
ఇక పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్ను ఓడించడానికి సీక్రెట్ ప్లాన్ వేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు, బీఆర్ఎస్, బీజేపీలు రహస్యంగా సీట్ల సర్దుబాటు కుదుర్చుకున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు ఆ ఆరోపణలను ఖండిస్తున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో బీజేపీ బలమైన అభ్యర్థిని దించుతుందని, నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో బీఆర్ఎస్ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించుతుందని, తద్వారా పరస్పరం గెలుపునకు సహకరించుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా ఎంఐఎం వైఖరి మరింత గందరగోళానికి తావిస్తోంది. కొద్ది నెలల క్రితం తాము కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నామని చెప్పిన అసదుద్దీన్ ఒవైసీ, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇది ప్రజల్లో తీవ్రమైన గందరగోళాన్ని సృష్టిస్తోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఈ పొత్తుల దాగుడుమూతల ధోరణిపై చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలు తమ పొత్తులు, సిద్ధాంతాలపై ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రజలను మోసగించినట్లే అవుతుంది.








