రేవంత్ సర్కార్కు అసలు సిసలు అగ్నిపరీక్ష!
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులైన పట్టభద్రుల నాడి ఎలా ఉందో అంచనా వేయడానికి ఈ ఎన్నికలు ఒక లిట్మస్ టెస్ట్ లా మారాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలలో దాదాపు మూడింట రెండొంతులు అంటే 77 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసే ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పోరు రసవత్తరంగా మారుతోంది.
కార్మికులు, నిరుద్యోగులు, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో విజయం సాధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన పాలనకు ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉందని నిరూపించుకోవాలనుకుంటోంది. ఒకవేళ ఫలితాలు వ్యతిరేకంగా వస్తే, అది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుంది. అంతేకాకుండా బీఆర్ఎస్, బీజేపీలు దీనిని ప్రభుత్వ వ్యతిరేకతగా ప్రచారం చేసే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ నాయకత్వం దీన్ని కేవలం సాధారణ ఎన్నికగా చూడకుండా.. రాజకీయ మనుగడకు, పట్టు నిలుపుకోవడానికి అత్యంత కీలకమైన పోరుగా భావిస్తోంది.
ఈ ఎన్నికల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక అడుగు ముందుకేసింది. మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ స్థానం నుంచి సామ రామమోహన్ రెడ్డిని, వరంగల్- నల్గొండ- ఖమ్మం స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని బరిలోకి దింపింది. సీఎం రేవంత్ రెడ్డికి స్వస్థలమైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఆయన దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ రెండు స్థానాల్లో గెలుపు కాంగ్రెస్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.
మరోవైపు.. ఈ ఎన్నికలు కేవలం అభ్యర్థుల సామర్థ్యంపైనా ఆధారపడవు. ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంస్థాగత బలానికి కూడా పెద్ద పరీక్షగా మారాయి. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ధన ప్రభావం గణనీయంగా ఉండేది. అధికార పార్టీ ఈసారి ప్రచారంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టాలని భావించడం లేదు. ఓటర్ల నమోదు ప్రక్రియను విజయవంతం చేయడానికి ఆన్లైన్ సదుపాయాలతో పాటు, నేరుగా ఓటర్లను సంప్రదించే వ్యూహాలకు పదును పెట్టారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు వివిధ జిల్లాల్లో పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సమన్వయం చేస్తున్నారు. అక్టోబర్ 23న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించి తుది ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.
ఇదిలా ఉంటే… బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధిత జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న జోష్లో ఉన్న బీజేపీ కూడా తన పట్టును మరింత నిలుపుకోవాలని చూస్తోంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌలభ్యం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఓటర్ల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేకపోవడం అన్ని ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. మొత్తానికి.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో ఎవరికి పట్టం కడతాయనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.








