గుంటూరు జనసేనలో తీవ్ర అసంతృప్తి..!
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం జనసేన(Janasena) పార్టీలో తీవ్ర చిచ్చు రేపింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల పర్వం సాగుతున్న తరుణంలో, గుంటూరు నగరానికి చెందిన జనసేన నాయకులు, వీర మహిళలు పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో పార్టీ కోసం రాత్రింబగళ్లు కష్టపడి పనిచేసిన తమకు సముచిత స్థానం కల్పించలేదని, కనీసం సీట్లు కూడా కేటాయించకుండా అన్యాయం చేశారంటూ స్థానిక జనసేన శ్రేణులు తీవ్ర ఆవేదన చెందుతున్నాయి.
ఈ సీట్ల కేటాయింపు వ్యవహారంపై జనసేన నాయకులు, వీర మహిళలు ప్రెస్ మీట్ పెట్టి తమ బాధను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఇన్నేళ్లుగా జెండాలు మోసి, ప్రజా సమస్యలపై పోరాడితే.. చివరకు తమకు తీవ్ర నిరాశే మిగిలిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. “మేము కేవలం జెండాలు మోయడానికే పరిమితమా? వార్డుల్లో ప్రత్యర్థులు మమ్మల్ని ‘జెండా కూలీలు’ అంటూ తీవ్రంగా హేళన చేస్తున్నారు” అని వారు రోదించారు. కష్టకాలంలో పార్టీని బతికించిన తమను కాదని, వేరే వాళ్లకు సీట్లు ఇచ్చుకోవడం ఎంతవరకు సమంజసమని కూటమి పెద్దలను, అధిష్టానాన్ని ప్రశ్నించారు.
అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంపై జనసేన అసంతృప్త నేతలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. తాము ఇప్పటికే వేసిన నామినేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని వారు కుండబద్దలు కొట్టారు. వార్డుల్లో తమకున్న ప్రజాబలం, పార్టీ క్యాడర్ మద్దతుతో ‘రెబల్’ అభ్యర్థులుగా బరిలో దిగి తీరుతామని సంచలన ప్రకటన చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసైనికులు రెబల్స్‌గా బరిలో దిగడానికి సిద్ధమవ్వడంతో, ఈ తిరుగుబాటు కూటమి అధికారిక అభ్యర్థుల గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.








