తాగుబోతుల్లో తెలంగాణే నెంబర్ వన్..!
భారతీయుల్లో జీవనశైలి వ్యాధుల ఉనికికి పొగాకు వినియోగమే ప్రధాన కారణమనేది దశాబ్దాలుగా ఉన్న అంచనా. అయితే, తెలంగాణలో మాత్రం ఈ సమీకరణాలు పూర్తిగా తలకిందులవుతున్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో పొగాకు వినియోగం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధుల భారం మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. ఇది వైద్య నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-6) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా దాదాపు 38 శాతం మంది పురుషులు ఏదో ఒక రూపంలో పొగాకును సేవిస్తున్నారు. అయితే, తెలంగాణలో మాత్రం ఈ రేటు కేవలం 22.3 శాతంగా మాత్రమే ఉంది. కానీ, మద్యపాన విషయానికి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. జాతీయ స్థాయిలో 15 ఏళ్లు పైబడిన పురుషులలో మద్యపానం చేస్తున్న వారి సగటు కేవలం 18.9 శాతంగా ఉండగా… తెలంగాణలో మాత్రం ఇది ఏకంగా 43.9 శాతానికి ఎగబాకింది. దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే పురుషుల మద్యపాన వినియోగంలో రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది ప్రజా ఆరోగ్య సంక్షోభానికి అద్దం పడుతోంది.
పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ వంటి నగరాల్లో పురుషుల మధ్యపాన వినియోగం 30.4 శాతంగా ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సగటున 46.6 శాతానికి చేరుకుంది. మరీ ముఖ్యంగా.. జనగామ లాంటి కొన్ని గ్రామీణ జిల్లాల్లో ఈ మద్యపాన వ్యాప్తి ఏకంగా 61.6 శాతంగా రికార్డవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కాలేయ సంబంధిత వ్యాధులు, జీవనశైలి రుగ్మతలు, హృదయ సంబంధ సమస్యలు వేగంగా ప్రబలడానికి ఈ అధిక స్థాయి మద్యపానమే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ అధ్యయనంలో అత్యంత విస్మయానికి గురిచేస్తున్న మరో కీలక అంశం మహిళల్లో మద్యపాన వినియోగం. దేశవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడిన మహిళల్లో మద్యపాన సగటు కేవలం 1.1 శాతంగా మాత్రమే ఉంది. కానీ, తెలంగాణలో ఈ రేటు 7.1 శాతంగా నమోదై దేశాన్ని విస్మయపరుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 2.8 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఇది ఏకంగా 8.6 శాతానికి చేరింది. పురుషులతో పాటు మహిళల్లోనూ ఈ వ్యసనం పెరుగుతుండటం సామాజికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదముంది.
ఇప్పటివరకూ ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు అమలు చేసిన నివారణ చర్యలు ప్రధానంగా పొగాకు నియంత్రణ చుట్టూనే తిరిగాయి. అయితే, క్షేత్రస్థాయిలో తెలంగాణ ఎదుర్కొంటున్న అసలు ముప్పు పొగాకు వల్ల ఉండట్లేదు. అదే సమయంలో అసాధారణ మద్యపాన వినియోగం వల్లే వస్తోందని ఈ డేటా స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. కేవలం సాధారణ అవగాహన సదస్సులకు పరిమితం కాకుండా, రాష్ట్రాన్ని పీడిస్తున్న ఈ మద్యపాన వ్యసన ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ, బలమైన ప్రజా ఆరోగ్య విధానాలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.








