కేటీఆర్ మాస్ మేక్ ఓవర్… ఏంటి రీజన్?
రాజకీయాల్లో ప్రచారం, పద్ధతులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కేవలం సిద్ధాంతాలు, సభా ప్రసంగాలకే పరిమితం కాకుండా, నాయకుల విజువల్ అప్పియరెన్స్, బాడీ లాంగ్వేజ్ కూడా ఓటర్ల మనస్తత్వాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సోషల్ మీడియా ఆధిపత్యం పెరిగిన తర్వాత ప్రతి నాయకుడు తన ఇమేజ్ను ఎప్పటికప్పుడు రీబ్రాండ్ చేసుకోవడం అనివార్యమైంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన క్లాస్ ఇమేజ్ను పక్కనపెట్టి, మాస్ లుక్‌లోకి మారడం చర్చనీయాంశమైంది.
ఇప్పటివరకు పార్టీ లీడర్ గా, గతంలో ఐటీ మంత్రిగా.. సూటు బూటు లేదా ట్రెండీ దుస్తుల్లో కనిపించిన కేటీఆర్.. ఇప్పుడు గడ్డంతో కనిపిస్తున్నారు. మాస్ లుక్‌తో ప్రజల ముందుకు వస్తున్నారు. సింగరేణి కార్మిక సభల నుంచి పార్టీ సమీక్షల వరకు ఆయన సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండటంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. త్వరలో చేపట్టబోయే పాదయాత్ర కోసం, క్షేత్రస్థాయి గ్రామీణ, కార్మిక వర్గాలకు మరింత చేరువయ్యేందుకే కేటీఆర్ ఈ మేక్ ఓవర్ ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో ఉన్న సాఫ్ట్ ముద్రను చెరిపేసుకోవడానికి నారా లోకేష్ తన పాదయాత్రకు ముందు బాడీ లాంగ్వేజ్, మాటతీరు మార్చుకున్నారు. పాదయాత్ర తర్వాత పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే తరహాలో తనపై ఉన్న అర్బన్, కార్పొరేట్ ముద్రను తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజకీయాల్లో గెటప్ మార్పు అనేది కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, క్యూరియాసిటీని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. చరిత్రను పరిశీలిస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు.., ఇటీవలికాలంలో రాహుల్ గాంధీ, నారా లోకేష్ వంటి నేతలు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఎండావానా లెక్క చేయకుండా ప్రజల మధ్య గడిపారు. ఆ శ్రమ వల్లే వారి గెటప్‌లకు ఒక శక్తివంతమైన సింబాలిజమ్ వచ్చింది. కేటీఆర్ పెంచిన గడ్డం లేదా మాస్ లుక్ అనేది పాదయాత్ర సమయంలో ఒక సీరియస్ పోరాట యోధుడి ఇమేజ్ ను కలిగిస్తుంది. అయితే ఆ ఇమేజ్ మాత్రమే పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందని చెప్పలేం.
మరోవైపు.. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు కేటీఆర్ కొత్త లుక్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి. మేక్ ఓవర్ అనేది ప్రచార వ్యూహంలో భాగమే అయినప్పటికీ, అది విజయానికి గ్యారంటీ ఇవ్వలేదు. కేటీఆర్ తన క్లాస్ పరిమితులను దాటుకుని, మాస్ లీడర్‌గా మారడానికి ఈ గెటప్ ఒక ముందడుగు కావచ్చు. కానీ బీఆర్ఎస్కు పూర్వ వైభవం రావాలన్నా, ప్రజల్లో విశ్వసనీయత పెరగాలన్నా.. ఆ గెటప్ వెనుక ఉన్న నాయకుడు తెలంగాణ క్షేత్రస్థాయి సమస్యలపై ఎంత కసిగా, ఎంత నిలకడగా పోరాడుతారనేదే అసలు పరీక్ష.








